బ్రిస్బేన్: భారత్ ‘ఏ’, ఆస్ట్రేలియా ‘ఏ’ జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకింత తడబడ్డ టీమ్ఇండియా మలి ఇన్నింగ్స్‌లో కంగారూలకు దీటైన సమాధానం చెబుతున్నది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి బెర్తు దక్కించుకోలేకపోయిన హార్డ్‌హిట్టర్ షెఫాలీవర్మ(52), రాగ్వి బిస్త్(86) అర్ధసెంచరీలతో కదంతొక్కడంతో రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 260 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు.
పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ను తలపిస్తూ షెఫాలీ తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో రాణించింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ రాగ్వి 13 ఫోర్లతో వరుసగా రెండో అర్ధసెంచరీని ఖాతాలో వేసుకుంది. ఎడ్గర్(4/53) నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుంది. చేతిలో రెండు వికెట్లు ఉన్న భారత్ ప్రస్తుతం 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 158/5 శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ‘ఏ’ 305 పరుగులు చేసింది. సైనా జింజర్(103) సెంచరీతో ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. ఆరో వికెట్‌కు నికోల్ పాథుమ్(54)తో కలిసి జింబర్ 102 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. సైమా ఠాకూర్(3/31) మూడు వికెట్లు తీయగా, రాధాయాదవ్(2/68), మిన్నుమని(2/110) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆదివారం మ్యాచ్‌కు ఆఖరి రోజు.