IPL 2023 | అహ్మదాబాద్ నగరాన్ని గిల్ తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేసింది! చిరు జల్లులుగా మొదలై పెను తుఫాన్‌గా మారి ముంబై బౌలర్లను ఊచకోత కోసింది. తన సూపర్ఫామ్కు కొనసాగింపుగా శుభ్‌మన్ గిల్..ముంబై ఇండియన్స్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. కండ్లు చెదిరే ఫోర్లు, వారెవా అనిపించే భారీ సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. తానేంత ప్రమాదకర బ్యాటరో మరోమారు చేతల్లో చూపెడుతూ ధనాధన్ సెంచరీతో కదంతొక్కాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయని నైజంతో గిల్ చెలరేగడంతో గుజరాత్ భారీ స్కోరు ముద్దాడింది. లక్ష్యఛేదనలో సూర్యకుమార్‌యాదవ్ ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయింది. మోహిత్‌శర్మ ఐదు వికెట్లతో విజృంభించడంతో ముంబై కోలుకోలేకపోయింది. ఆదివారం గుజరాత్, చెన్నై మధ్య ఐపీఎల్ టైటిల్ పోరు జరుగనుంది.
అహ్మదాబాద్: ఐపీఎల్ 16వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తద్వారా వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరులో నిలిచింది. వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే అర్ధగంట ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ముంబై..గుజరాత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కిక్కిరిసిన స్టేడియంలో ఆది నుంచే టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 129, 7ఫోర్లు, 10 సిక్స్‌లు) దూకుడైన ఆటతీరు కనబరిచాడు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
గిల్ ఎడపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 233/3 భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్(43, రిటైర్డ్ హర్ట్) ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఆకాశ్ మద్వాల్, పీయూశ్ చావ్లా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులు చేసింది. సూర్యకుమార్య్రాదవ్(38 బంతుల్లో 61, 7ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌వర్మ(14 బంతుల్లో 43, 5ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఎవరూ అంతగా రాణించలేకపోయారు. మోహిత్‌శర్మ(5/10) ఐదు వికెట్లతో చెలరేగగా, షమీ(2/41), రషీద్‌ఖాన్(2/33) ముంబై పతనంలో కీలకమయ్యారు. సుడిగాలి ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ నెల 28న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
గుజరాత్: 20 ఓవర్లలో 233/3(గిల్ 129, సుదర్శన్ 43, పియూశ్ చావ్లా 1/45, ఆకాశ్ 1/52),
ముంబై: 18.2 ఓవర్లలో 171 ఆలౌట్(సూర్యకుమార్ 61, తిలక్‌వర్మ 43, మోహిత్‌శర్మ 5/10, రషీద్‌ఖాన్ 2/33)