IND vs IRE | ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంలో దుమ్మురేపుతుండటంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటర్లు రాణించడంతో యంగ్ ఇండియా భారీ స్కోరు చేయగా.. ఆనక బౌలర్లు విజృంభించడంతో విజయం సాధ్యమైంది. బ్యాట్‌తో రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రింకూ సింగ్ రాణిస్తే.. బంతితో బుమ్రా,ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ సత్తాచాటారు!
డబ్లిన్: యువ ఆటగాళ్లంతా సమిష్టిగా కదంతొక్కడంతో ఐర్లాండ్‌పై టీమ్ఇండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ 33 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. సంజూ శాంసన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, ఒక సిక్సర్), రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు.
ఐర్లాండ్ బౌలర్లలో మెక్‌కార్టీ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులకు పరిమితమైంది. ఆండీ బాల్బిర్ని (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రింకూ సింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో మ్యాచ్ బుధవారం జరగనుంది.
రింకూ ఫినిషింగ్ టచ్
వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంటారని భావిస్తున్న యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ (18), తిలక్ వర్మ (1)పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే (22 నాటౌట్; 2 సిక్సర్లు) సత్తాచాటడంతో యువ భారత్ మంచి స్కోరు చేయగలిగింది. గత మ్యాచ్‌లో వర్షం కారణంగా మిడిలార్డర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కకపోగా.. ఈసారి వచ్చిన అవకాశాన్ని వారంతా సద్వినియోగపర్చుకున్నారు. 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును రుతురాజ్, శాంసన్ ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా.. క్రీజులో కుదురుకున్నాక సునాయాసంగా పరుగులు రాబట్టారు. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించాక శాంసన ఔట్ కాగా.. ఆఖర్లో రింకూ దుమ్మురేపాడు. 19వ ఓవర్లో రింకూ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదగా.. ఆఖరి ఓవర్లో దూబే రెండు సిక్సర్లతో రఫ్ఫాడించాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో భారత్ 42 పరుగులు రాబట్టింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 185/5 (గైక్వాడ్ 58, శాంసన్ 40; మెక్‌కార్టీ 2/36), ఐర్లాండ్: 20 ఓవర్లలో 152/8 (బాల్బిర్ని 72; బుమ్రా 2/15, ప్రసిద్ధ్ కృష్ణ 2/29)