హైదరాబాద్: అదితి అశోక్ ( Aditi Ashok ) ఇప్పుడో సెన్షేషన్. ఈ ఇండియన్ గోల్ఫర్ టోక్యో ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శన ఇచ్చింది. వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో ఓ మెరుపు మెరిసింది. టోక్యోలో మెడల్ మిస్సైనా.. ఇండియన్ గోల్ఫర్లు కూడా అంతర్జాతీయంగా రాణిస్తారన్న సంకేతాన్ని ఆమె ఇచ్చింది. ఆరేళ్ల వయసులోనే ఆమె గోల్ఫ్ ఆటకు ఆకర్షితురాలైంది. 2017లో ఆమె లేడీస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ప్లేయర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ ఏడాది లూయిస్ సగ్స్ రూకీ ర్యాంకింగ్స్‌లో ఆమె 8వ స్థానంలో నిలిచింది.
2016లో రియోలో జరిగిన మహాక్రీడలకు ఎంపికైన యువ క్రీడాకారిణిగా కూడా రికార్డు సృష్టించింది. 18 ఏళ్ల, నాలుగు నెలల వయసులోనే ఆమె ఒలింపిక్స్‌కు ఎంట్రీ ఇచ్చింది. బెంగుళూరుకు చెందిన ఈ గోల్ఫర్.. రియోలో ఒంటరిగా మహిళల ఈవెంట్లో దేశం తరపున పోటీ చేసింది. ఈసారి టోక్యోలో మాత్రం అదితితో పాటు మరో గోల్ఫర్ దీక్షా సాగర్ కూడా రంగంలోకి దిగింది.
12 ఏళ్ల వయసులోనే గోల్ఫర్ అదితి.. ఆసియా పసిఫిక్ ఇన్విటేషనల్ టోర్నీలో పాల్గొన్నది. నిజానికి ఆ టోర్నీ ఆడేందుకు సగటును 18 నుంచి 22 ఏళ్ల వయసు ఉండాలి. ఇక 13 ఏళ్లకే భారత్‌లో జరిగిన తొలి ప్రొఫెషనల్ టూర్లో ఆమె విజయం సాధించింది. గోల్ఫ్‌లో సంచలనంగా మారిన అదితి.. వరుసగా మూడుసార్లు జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. 2012 నుంచి 2014 వరకు ఆమె చాంపియన్‌గా ఆవిర్భవించింది. 2011, 2014లో అదితి అశోక్.. రెండు సార్లు నేషనల్ అమెచ్యూర్ చాంపియన్‌గా రికార్డు సృష్టించింది. ఇక 2013లో ఏషియన్ యూత్ గేమ్స్‌లో ప్రాతినిధ్యం వహించిన ఏకైన భారతీయ గోల్ఫర్ ఈమె. 2014లో యూత్ ఒలింపిక్ గేమ్స్, అదే ఏడాది ఏషియన్ గేమ్స్‌లోనూ పాల్గొన్నది.
భారత్‌లో గోల్ఫ్ ఆటను పాపులర్‌గా చేయాలన్న అదితి ఆకాంక్ష. సోషల్ మీడియాను కూడా ఆ టార్గెట్ కోసం వాడాలన్న అభిప్రాయంలో ఆమె ఉన్నది. ఇటీవల గోల్ఫ్ ఆటలో ఆడవారి ప్రాతినిధ్యం పెరిగినట్లు ఆమె అభిప్రాయపడింది. తాను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు, కేవలం నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగినట్లు అదితి చెప్పింది.
తన హోమ్టౌన్ బెంగుళూరులో ఇప్పుడు గోల్ఫ్ కోర్సుల సంఖ్య పెరిగినట్లు అదితి చెబుతోంది. ఒకప్పుడు మూడు కోర్సులు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య పెరిగినట్లు ఆమె చెప్పింది. మెట్టు మెట్టు ఎదుగుతున్న అదితి.. దేశంలోని మహిళా గోల్ఫర్లకు ప్రేరణగా నిలువనున్నది. రెండుసార్లు ఒలింపిక్స్ ఆడిన అదితి.. రియోలో 41వ స్థానంలో నిలిచింది. కానీ ఈసారి పతక ఆశలు రేపి.. చివర్లో నాలుగవ స్థానాన్ని సరిపెట్టుకున్నది. ప్రపంచ నెంబర్ వన్, అమెరికాకు చెందిన నెల్లి కోర్డా టోక్యో గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నది.