e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home స్పోర్ట్స్ ‘గ్రాండ్‌మాస్టర్‌' రిత్విక్‌ కు జీఎమ్‌ హోదా

‘గ్రాండ్‌మాస్టర్‌’ రిత్విక్‌ కు జీఎమ్‌ హోదా

  • హంగరీ టోర్నీలో అద్భుత ప్రదర్శన
  • తెలంగాణ నుంచి మూడో జీఎమ్‌గా ఘనత
  • నమస్తే తెలంగాణతో జీఎమ్‌ రాజా రిత్విక్‌
  • హంగరీ నుంచి ప్రత్యేక ఇంటర్వ్యూ
  • లక్ష్యం 2600

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ వేదికపై మరో తెలంగాణ క్రీడాతార తళుక్కుమంది. పసితనం నుంచే చదరంగంలో సంచలనాలు సృష్టిస్తున్న రాజవరం రాజారిత్విక్‌ గ్రాండ్‌మాస్టర్‌(జీఎమ్‌)గా అవతరించాడు. బుడాపెస్ట్‌(హంగరీ)లో జరిగిన వెజెర్‌కెప్జో టోర్నీలో రిత్విక్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 2496 ఎలో రేటింగ్‌ పాయింట్లతో బరిలోకి దిగిన రిత్విక్‌ నాలుగు రౌండ్లలో ఐదు పాయింట్లతో 2501 రేటింగ్‌ దక్కించుకుని జీఎమ్‌ హోదా కైవసం చేసుకున్నాడు. నాలుగో రౌండ్‌లో తెల్లపావులతో బరిలోకి దిగిన ఈ 17 ఏండ్ల యువ చెస్‌ ప్లేయర్‌ ఫిడే మాస్టర్‌ ఫినెక్‌ వక్లావ్‌(చెకోస్లావియా)పై 57 ఎత్తుల్లో విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లను ఓడించిన రిత్విక్‌ తెలంగాణ నుంచి మూడో జీఎమ్‌గా నిలిచాడు. ఇంతకుముందు రాష్ట్రం నుంచి ఇరిగేసి అర్జున్‌, హర్షభరత్‌ కోటి జీఎమ్‌ నార్మ్‌ పొందారు. ఓవరాల్‌గా భారత్‌ నుంచి 70వ జీఎమ్‌గా రిత్విక్‌ నిలిచాడు. మూడో జీఎమ్‌ నార్మ్‌ దక్కించుకునే క్రమంలో ఈనెల 4 నుంచి 14 వరకు జరిగిన టోర్నీలో రిత్విక్‌ తొమ్మిది రౌండ్లలో ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. హంగరీ, స్లోవేకియా, సింగపూర్‌కు చెందిన ప్లేయర్లపై ఐదు విజయాలు, నాలుగు గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. తనకంటే మెరుగైన ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లపై అలవోక విజయాలు సొంతం చేసుకున్నాడు. అంతకుముందు జరిగిన ఫస్ట్‌ సాటర్‌డే ఆర్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో టైటిల్‌ విజేతగా నిలిచాడు. రౌండ్‌ రాబిన్‌ చాంపియన్‌షిప్‌లో ఒక్క గేమ్‌ కోల్పోకుండా అజేయంగా నిలిచాడు. సికింద్రాబాద్‌ సైనిక్‌పురిలోని భవన్స్‌ శ్రీరామకృష్ణ విద్యాలయంలో ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న రిత్విక్‌ది వరంగల్‌ స్వస్థలం. ఆరేండ్ల ప్రాయంలోనే చెస్‌లో అడుగుపెట్టిన ఈ కుర్రాడు రేస్‌ చెస్‌ అకాడమీలో ఎన్‌వీఎస్‌ రామరాజు దగ్గర శిక్షణ తీసుకున్నాడు. గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్న రిత్విక్‌ను రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

గ్రాండ్‌మాస్టర్‌ హోదాపై మీ స్పందన?

గ్రాండ్‌మాస్టర్‌(జీఎమ్‌) హోదా దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. జీఎమ్‌ నార్మ్‌ పొందడంలో కష్టనష్టాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందు కు సాగాను. కరోనా వైరస్‌ విజృంభణ కారణంగా పలు టోర్నీలు రద్దు, వాయిదా పడటం జీఎమ్‌ హోదా ఆలస్యం కావడానికి కారణమైంది. అయినా వెనుకకు తగ్గకుండా గత కొం త కాలంగా పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఆడుతూ ఎలో రేటింగ్‌ పాయింట్లు కైవసం చేసుకున్నాను. ఈ క్రమంలో ఎనిమిది టోర్నీల్లో పోటీకి దిగాను. సెర్బియా, లాత్వియా, స్లోవేకియా, హంగరీలో జరిగిన టోర్నీ ల్లో అంతర్జాతీయ స్థాయి ప్లేయర్లతో తలపడ్డాను. ఎల్లోబ్రెగట్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో తొలి జీఎమ్‌ నార్మ్‌ కైవసం చేసుకున్నాను. ఇరవై రోజుల వ్యవధిలో కీలకమైన ఎలో రేటింగ్‌ పాయింట్లతో జీఎమ్‌ హోదాను చేరుకున్నాను.

తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది?

- Advertisement -

జీఎమ్‌ హోదా పొందే క్రమంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది. పసి వయసు నుంచి నాకు మద్దతు నిలుస్తున్న వారికి అన్ని రకాలుగా రుణపడి ఉంటాను. ముఖ్యంగా విదేశాల్లో పర్యటించే సమయంలో నా వెంట అమ్మ దీప తప్పనిసరిగా ఉంటుంది. ప్రతీ టోర్నీలో ఆమె ఇచ్చే ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా పోరాడటమే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఈ స్థాయికి చేరుకోవడంలో వారు అందించిన మద్దతు కలకాలం గుర్తుంటుంది.

తదుపరి లక్ష్యమేంటి?

జీఎమ్‌ హోదా దక్కించుకున్న నా ప్రస్తుత లక్ష్యం 2600 ఏలో రేటింగ్‌ సాధించడమే. దీని కోసం మరింత కష్టపడుతాను. ప్రస్తుతం హంగేరీలో ఉన్న నేను మరికొన్ని టోర్నీల్లో ఆడటం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత మేజర్‌ టోర్నీల్లో బరిలోకి దిగాలనేది ఆలోచన. అక్టోబర్‌లో స్వదేశానికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు విరామం తీసుకుని తిరిగి టోర్నీల్లో ఆడేందుకు ప్లాన్‌ చేసుకుంటాను. గత కొన్ని నెలల నుంచి విరామం లేకుండా టోర్నీలు ఆడుతున్నాను.

కెరీర్‌పై కరోనా ప్రభావం ఎలా ఉంది?

కరోనా వైరస్‌ విజృంభణ నా కెరీర్‌పై ఒకింత ప్రభావం చూపిందనే చెప్పాలి. వైరస్‌ వలన రెగ్యులర్‌గా జరుగాల్సిన టోర్నీల్లో కొన్ని రద్దు కావడం వాయిదా పడటం జరిగింది. దీని వలన జీఎమ్‌ హోదా దక్కించుకునేందుకు ఆలస్యమైంది. లేకపోతే దాదాపు ఏడాది కిందే ఈ స్థాయికి చేరుకునే అవకాశముండేది. కానీ ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అవకాశమున్న ప్రతి టోర్నీలోనూ సత్తాచాటాను. కరోనా వైరస్‌తో ఆన్‌లైన్‌లో టోర్నీలో జరిగినా..ముఖాముఖి పోటీల్లోనే ఎలో రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే వీలైనంతగా ప్రత్యక్ష టోర్నీల్లోనే పాల్గొన్నాను. ఆన్‌లైన్‌ టోర్నీల్లో ఆడేటప్పుడు అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ ప్రాక్టీస్‌ కోల్పోకుండా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి. దీనికి తోడు సరదాగా ఆడేందుకు పనికొస్తాయి.

జీఎమ్‌ నార్మ్‌ పొందాడు ఇలా..

ఎల్లోబ్రెగట్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ చాంపియన్‌షిప్‌లో తొలి జీఎమ్‌ నార్మ్‌
స్కాలికా ఇంటర్నేషనల్‌ ఓపెన్‌(స్లోవేకియా)లో రెండో నార్మ్‌
హంగరీలో ఫస్ట్‌ సాటర్‌డే జీఎమ్‌ ఆర్‌ఆర్‌ టోర్నీలో మూడో నార్మ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement