గత సీజన్లో భారీ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈ సీజన్లో సమిష్టి వైఫల్యంతో దారుణంగా విఫలమవుతున్నది. సొంత వేదికలోనూ విఫలమవుతున్న సన్‌రైజర్స్.. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో చేతులెత్తేసింది. టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి 152 పరుగులకే పరిమితమైన రైజర్స్.. తర్వాత బంతితో కూడా మాయ చేయలేక ఈ టోర్నీలో వరుసగా నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుని ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. స్వల్ప ఛేదనలో గుజరాత్‌కు గిల్.. మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని అందించాడు.
SRH | హైదరాబాద్: ఐపీఎల్-18లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుస వైఫల్యాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్.. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాభవం పాలైంది. సమిష్టిగా విఫలమైన హైదరాబాద్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ‘లోకల్ భాయ్’ సిరాజ్ (4/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 31, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. సాయి కిషోర్ (2/24), ప్రసిధ్ కృష్ణ (2/25) హైదరాబాద్‌ను కట్టడిచేశారు. ఛేదనను గుజరాత్.. 16.4 ఓవర్లలోనే పూర్తిచేసింది. శుభ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్, 9 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. సిరాజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సీజన్లో హైదరాబాద్‌కు ఇది నాలుగో ఓటమి కాగా గుజరాత్‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడో విజయం.
దంచేసిన గిల్, సుందర్
స్వల్ప ఛేదనను గుజరాత్ కూడా పేలవంగానే ఆరంభించింది. షమీ (2/28), కమిన్స్ (1/26) ధాటికి టైటాన్స్.. ఐదు ఓవర్లలో 28/2గా నిలిచింది. షమీ మూడో ఓవర్లో సుదర్శన్ (5) అనికేత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అవగా మరుసటి ఓవర్లో కమిన్స్.. బట్లర్‌ను డకౌట్ చేయడంతో గెలుపుపై హైదరాబాద్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ గుజరాత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్.. కెప్టెన్ గిల్‌తో కలిసి ఆ ఆశలను ఆదిలోనే తుంచేశాడు. సిమర్జిత్ 6వ ఓవర్లో వాషింగ్టన్.. 4, 4, 6, 6తో 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఆ తర్వాత గుజరాత్ వెనుదిరిగి చూడలేదు. క్రీజులో నిలదొక్కుకున్నాక గిల్ కూడా జోరు పెంచాడు. సుందర్ అంత వేగంగా ఆడకపోయినా గిల్.. 38 బంతుల్లో అర్ధశతకం పూర్తయింది. అయితే హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉండగా షమీ వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి అనికేత్ అద్భుత డైవ్ క్యాచ్‌తో వాషింగ్టన్ పెవిలియన్ చేరడంతో 90 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సుందర్ నిష్క్రమించినా ఇషాంత్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రూథర్‌ఫర్డ్.. అభిషేక్ 15వ ఓవర్లో నాలుగు బౌండరీలు బాది టైటాన్స్‌ను విజయానికి చేరువ చేశాడు. కమిన్స్ ఓవర్లో 6, 4తో మ్యాచ్‌ను ముగించాడు.
బోరింగ్ బ్యాటింగ్!
ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత రైజర్స్ డిఫెన్స్‌కే పరిమితమైంది. ఒక దశలో 36 బంతుల పాటు బౌండరీ రాలేదు. 4 ఓవర్ నుంచి 10వ ఓవర్ మధ్యలో మన బ్యాటర్లు సింగిల్స్‌తోనే సరిపెట్టారు. ఇన్నింగ్స్ మొత్తమ్మీద రెండు సిక్సర్లే నమోదయ్యాయంటే మన బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఓపెనర్లతో పాటు ఇషాన్ కిషన్ (17), హెన్రిచ్ క్లాసెన్ (31) నిరాశపరచగా నితీశ్ 34 బంతులాడినా ధాటిగా ఆడలేకపోయాడు. ప్రసిధ్ 8వ ఓవర్లో రెండో బంతిని పుల్ చేయబోయిన ఇషాన్.. డీప్ బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్ వద్ద ఇషాంత్‌కు చిక్కాడు. క్లాసెన్.. రషీద్ ఖాన్ 13వ ఓవర్లో నాలుగో బంతిని స్టాండ్స్‌లోకి పంపించి హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్ నమోదుచేశాడు. కానీ సాయి కిషోర్.. వరుస ఓవర్లలో క్లాసెన్‌తో పాటు నితీశ్‌ను ఔట్ చేసి రైజర్స్ భారీ స్కోరు ఆశలపై నీళ్లు చల్లాడు. చివరి స్పెల్‌లో బంతినందుకున్న సిరాజ్.. మరోమారు రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. 19వ ఓవర్లో అతడు.. అనికేత్ (18)తో పాటు సిమర్జిత్నూ ఔట్ చేశాడు. ఆఖర్లో కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో హైదరాబాద్.. గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.
సిరాజ్ జోరు..
ఈ సీజన్లో ఆరంభ మ్యాచ్ మినహా తర్వాత వరుసగా విఫలమవుతున్న సన్‌రైజర్స్.. గుజరాత్‌తో పోరులోనూ వైఫల్య ప్రదర్శనను కొనసాగించింది. గత మ్యాచ్‌ల మాదిరిగానే టాపార్డర్ చేతులెత్తేయడం రైజర్స్‌ను దెబ్బతీసింది. తాజా సీజన్లో గుజరాత్‌కు ఆడుతూ సంచలన ప్రదర్శనలతో సత్తాచాటుతున్న హైదరాబాదీ పేసర్ సిరాజ్ దెబ్బకు కమిన్స్ సేన ఆరంభంలోనే రిథమ్ కోల్పోయింది. విధ్వంసకర ‘ట్రావిషేక్’ ఓపెనింగ్ జోడీని పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆరంభ ఓవర్లలోనే హైదరాబాద్‌కు షాకులిచ్చాడు. మొదటి ఓవర్లోనే రెండు బౌండరీలతో జోరుమీద కనిపించిన హెడ్ (8).. ఆ ఓవర్లో సిరాజ్ వేసిన ఆఖరి బంతికి మిడ్ వికెట్లో సుదర్శన్ చేతికి చిక్కడంతో రైజర్స్ వికెట్ల పతనం మొదలైంది. ఇషాంత్ శర్మ రెండో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో అలరించిన అభిషేక్.. సిరాజ్ ఐదో ఓవర్లో మిడాన్ వద్ద తెవాటియాకు క్యాచ్ ఇచ్చాడు. ఐపీఎల్లో సిరాజ్‌కు ఇది వందో వికెట్.
సంక్షిప్త స్కోర్లు:
హైదరాబాద్: 20 ఓవర్లలో 152/8 (నితీశ్ 31, క్లాసెన్ 27, సిరాజ్ 4/17, సాయి 2/24); గుజరాత్: 16.4 ఓవర్లలో 153/3 (గిల్ 61, సుందర్ 49, షమీ 2/28, కమిన్స్ 1/26)