Shubman Gill : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గురించి కీలక అప్డేట్ వచ్చింది. మెడకు గాయంతో వన్డే సిరీస్‌కూ సైతం దూరమైన గిల్ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. వరుసగా సఫారీలతో రెండు సిరీస్‌లలో ఆడని భారత కెప్టెన్ తదుపరి టీ20 సిరీస్‌లోపు ఫిట్నెస్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అందుకని.. భారత కెప్టెన్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో చేరనున్నాడు. డిసెంబర్ 9 నుంచి మొదలయ్యే పొట్టి సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది.
ఇటీవలే టెస్టు, వన్డే పగ్గాలు స్వీకరించిన శుభ్‌మన్ అనుకోకుండా గాయంతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. కోల్‌కతా టెస్టులో హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి మెడకు బంతి తగిలించుకున్న గిల్ ఆ తర్వాత నుంచి మైదానంలోకి దిగలేదు. మెరుగైన చికిత్స కోసం ముంబై వెళ్లిపోయిన గిల్.. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. రాంచీలో తొలి వన్డేకు ముందు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ గిల్ ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. భారత సారథి ఆరోగ్యం మెరుగైందని.. అతడు త్వరలోనే మైదానంలోకి దిగుతాడని మోర్కెల్ చెప్పాడు. అతడు అన్నట్టే.. గిల్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరనున్నాడు.
🚨 Shubman Gill to return for India-South Africa T20Is?
Gill is headed to the Centre of Excellence in Bengaluru for Rehabilitation today. There’s more than a 50% chance he will get clearance to play before the T20Is start on December 9 #INDvSA pic.twitter.com/qsttZ35kGr
— Cricbuzz (@cricbuzz) December 1, 2025
సోమవారం సాయంత్రం లోపు గిల్ సీఓఈలో అడుగుపెడుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అక్కడ నిపుణుల సమక్షంలో ఫిట్నెస్ పరీక్షలో పాల్గొనాలనకుంటున్నాడు టీమిండియా కెప్టెన్. అయితే.. ప్రస్తుతానికైతే గిల్‌కు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు 50 శాతమే అవకాశముందని సమాచారం. కాబట్టి.. గిల్ రిస్క్ తీసుకుంటాడా? లేదంటే మరి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 9న టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వన్డేలకు దూరమైన ప్రధాన పేసర్ బుమ్రా సైతం టీ20ల్లో ఆడే అవకాశముందని టాక్.