న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్(Gautam Gambhir) రేసులో ఉన్నట్లు ఇటీవల వార్తలు వ్యాపించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్‌తో హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకోనున్నారు. అయితే ఆ తర్వాత ద్రావిడ్ వారసత్వాన్ని గంభీర్ తీసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు గంభీర్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. తాను అంత దూరం ఆలోచించడం లేదన్నారు. కానీ ఇటీవల ఐపీఎల్లో కేకేఆర్ జట్టుకు టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించారు. టీమ్ ఫస్ట్ ఐడియాలజీతో కోచింగ్ బాధ్యతలను నిర్వహించనున్నట్లు గంభీర్ తెలిపారు.
నిజానికి బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన వర్చువల్ ఇంటర్వ్యూకు గంభీర్ హాజరయ్యాడు. శుక్రవారం జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్‌లో గంభీర్ మాట్లాడుతూ.. అంత దూరం ఆలోచించడం లేదని, మీరు ఈ విషయంపై ప్రశ్నలు వేస్తున్నారని, అన్ని కఠినమైన ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్పుడే సమాధానం ఇవ్వడం కష్టమన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్ పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ఓ అద్భుతమైన జర్నీ ముగిసిందని, దాన్ని ఎంజాయ్ చేశానని, ప్రస్తుతం తాను సంతోషంగా ఉన్నట్లు సెమీనార్‌లో గంభీర్ పేర్కొన్నారు.
తన కోచింగ్ ఫిలాసఫీలో జట్టుకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యక్తులపై కాకుండా జట్టు సమిష్టి కృషిపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తిపై ఫోకస్ పెట్టకుండా మొత్తం జట్టుపై దృష్టి పెడితే, అప్పుడు అన్నీ లైన్లోకి వచ్చేస్తాయని, ఇవాళ కాకున్నా, రేపైనా అన్నీ సెట్ అవుతాయన్నారు. ఒక్కరు లేదా ఇద్దరిపై దృష్టి పెడితే, అప్పుడు జట్టు ఇబ్బందిపడుతుందన్నారు. మెంటర్‌గా కేకేఆర్ జట్టును అలాగే తీర్చిదిద్దినట్లు వెల్లడించారు. టీమే ఫస్ట్ అన్న సిద్ధంతాం తనదని, ఏ టీమ్ క్రీడలకైనా .. టీమ్ ఫస్ట్ ఐడియాలజీ, టీమ్ ఫస్ట్ ఫిలాసఫీ ముఖ్యమని గంభీర్ తెలిపారు.
క్రికెట్ ఆడే 11 మందిని సమానంగా చూడాలని, వారందరికీ సమాన గౌరవం ఉంటే, అందర్నీ సమానంగా చూస్తే, వారందరికీ గౌరవం, మర్యాద, బాధ్యత ఒకేలా ఉంటే, అప్పుడు అసాధారణ విజయాలు సొంతం అవుతాయని గంభీర్ పేర్కొన్నారు. ఒక సంస్థలో వివక్ష ఉండకూడదన్నారు.