Coco Gauff | బీజింగ్: మహిళల టెన్నిస్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ కోకో గాఫ్ ఈ ఏడాది చైనా ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఆదివారం బీజింగ్‌లోని డైమండ్ కోర్ట్ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో గాఫ్.. 6-1, 6-3తో కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)ను వరుస సెట్లలో చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో గాఫ్ 6 ఏస్‌లు సంధించగా ముచోవా 2 మాత్రమే కొట్టగలిగింది.
ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్.. గత మ్యాచ్‌లకు భిన్నంగా ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ వరుస సెట్లలో గెలిచి ట్రోఫీని దక్కించుకుంది. తద్వారా 2013 (సెరెనా విలియమ్స్) తర్వాత చైనా ఓపెన్ గెలిచిన రెండో ప్లేయర్‌గా గాఫ్ రికార్డులకెక్కింది. ఈ ఏడాది ఆమెకు ఇది రెండో డబ్ల్యూటీఏ 1000 టైటిల్ కాగా ఓవరాల్‌గా 8వ టైటిల్. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కారజ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.