దుబాయ్: ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా సౌరవ్ గంగూలీ బాధ్యతలు అందుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత తొమ్మిదేండ్లుగా చైర్మన్‌గా కొనసాగుతున్న దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగియనుంది. మూడు పర్యాయాలకు మించి కొనసాగే అవకాశం లేకపోవడంతో కుంబ్లే తప్పుకోవాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో అపార అనుభవమున్న గంగూలీ ఇక నుంచి చైర్మన్‌గా వ్యవహరించనున్నాడు. దీనిపై ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ ‘క్రికెట్ కమిటీ చైర్మన్‌గా గంగూలీ నియామకాన్ని స్వాగతం పలుకుతున్నాం. మేటి క్రికెటర్లలో ఒకడైన గంగూలీ సేవలను ఉపయోగించుకుంటాం. బీసీసీఐ అధ్యక్షుడిగా అతడి అనుభవం ఎంతో దోహదం చేస్తుంది. తొమ్మిదేండ్ల పాటు సేవలందించిన కుంబ్లేకు కృతజ్ఞతలు. క్రికెట్ ప్రమాణాలు పెంచేందుకు కుంబ్లే కృషి చేశాడు’ అని అన్నాడు. ఐసీసీ మహిళల కమిటీ..ఇక నుంచి మహిళల క్రికెట్ కమిటీగా వ్యవహరించనుంది. వెస్టిండీస్‌కు చెందిన జానీ గ్రేవ్ సీఈవోగా ఎంపికయ్యారు.