BCCI | ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలైంది. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులతో శనివారం కీలక సమావేశం నిర్వహించబోతున్నది. ఈ భేటీలో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భవితవ్యంపై సైతం చర్చించనున్నట్లు తెలుస్తున్నది. స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వరుసగా సిరీస్‌లను టీమిండియా కోల్పోయింది. సీనియర్ ప్లేయర్లు ఇద్దరూ బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోయారు. వచ్చే నెలలో చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఇప్పటి నుంచే జట్టులో ప్రక్షాళన చేయాలా? ఐసీసీ ఈవెంట్ వరకు వేచి చూడాలా? అన్నదానిపై సైతం చర్చించనున్నట్లు సమాచారం.
సీనియర్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ తిరిగి ఫామ్‌లోకి వచ్చే అవకాశం ఇవ్వనుండగా.. చాంపియన్స్ ట్రోఫీలో భాగం అయ్యే అవకాశం ఉంది. రోహిత్, విరాట్ ఇద్దరూ వన్డేల్లో ఆకట్టుకున్నారు. 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత.. రోహిత్, కోహ్లీ 2024లో మూడు వన్డేలు మాత్రమే ఆడారు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ ఫామ్ అంతంత మాత్రంగానే ఉన్నది. కోహ్లీ లంక టూర్లో వరుసగా 24, 12, 20 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ 58, 64, 35 పరుగులు చేయగలిగాడు. టెస్టుల్లో తమ ప్రదర్శనతో విఫలమైన ఇద్దరు ప్లేయర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు సరైన అవకాశమని చెప్పొచ్చు. వన్డేల విషయం పక్కన పెడితే రోహిత్, కోహ్లీ టెస్టుల భవిష్యత్తు మాత్రం భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి.
జూన్ వరకు టీమిండియా టెస్టులు ఆడబోదు. జూన్‌లో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనున్నది. ఈ సిరీస్‌కు ముందు రోహిత్, విరాట్ ఫామ్‌పై అంచనా వేసి జట్టులోకి తీసుకోవాలా? లేదా? అన్న అంశంపై చర్చించే అవకాశం ఉన్నది. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ పెర్త్ టెస్టులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఐదు టెస్టుల్లో 23.75 సగటుతో మొత్తం 190 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా పర్యటన పెద్ద పీడకలగా మారింది. పెర్త్ టెస్టుకు దూరమైన రోహిత్.. ఆ తర్వాత నాలుగు మ్యాచుల్లో కేవలం 31 పరుగులు చేశాడు. ఇక హెడ్‌కోచ్ గంభీర్‌తో పాటు కోచింగ్ స్టాఫ్ పనితీరును సైతం సమీక్షించే అవకాశాలున్నాయి.