హైదరాబాద్, ఆట ప్రతినిధి : రాష్ట్రంలో క్రీడా స్టేడియాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది! ఇప్పటికే చారిత్రక ఎల్బీ స్టేడియం పరిస్థితి దీనస్థితికి చేరగా, తాజాగా గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం అదే కోవలో చేరబోతున్నది. నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియాన్ని ఇప్పటికే కమర్షియల్ ఈవెంట్లకు అడ్డాగా మార్చిన ప్రభుత్వం…గచ్చిబౌలిపై నజర్ వేసింది. ఇది వరకే ఎల్బీ స్టేడియంలో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లతో పాటు పలు కమర్షియల్ కార్యక్రమాలకు కిరాయికి ఇస్తున్న ప్రభుత్వం గచ్చిబౌలిని కూడా అదే పరిస్థితికి తీసుకెళుతున్నది. కార్పొరేట్ ఫ్రాంచైజీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ కమర్షియల్ దందాకు తెరలేపింది. నిర్వాహకులకు ఆదాయాన్ని ఆర్జించే పెట్టే ఈవెంట్లకు సీఎం స్థాయిలో పైరేవీలు జరుగుతుండటం విమర్శలకు తావు ఇస్తున్నది. శనివారం జరిగే ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ రౌండ్-2 కోసం గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియం రూపురేఖలే మార్చేసింది. బైక్ స్పోర్ట్స్ ఈవెంట్‌కు అనుకూలంగా ఉండేందుకు అటు అథ్లెటిక్స్ ట్రాక్‌తో పాటు ఫుట్‌బాల్ మైదానాన్ని మొత్తం మట్టితో నింపేసింది. ఇది వరకే అథ్లెటిక్స్ ట్రాక్ పూర్తిగా పగుళ్లు వచ్చి ప్లేయర్లకు ఏ మాత్రం అనుకూలంగా లేకపోగా ఇప్పుడు మట్టి కూడా నింపడంతో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. మరోవైపు ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)తో పాటు పలు ప్రతిష్టాత్మక టోర్నీలకు వేదికైన ఫుట్‌బాల్ మైదానం పరిస్థితి చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశంలో ఇప్పుడిప్పుడే వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు మెటార్ స్పోర్ట్స్ ఈవెంట్ కోసం గచ్చిబౌలి స్టేడియాన్ని ఎంచుకున్నారు.
అయితే రేసింగ్ కోసం పెద్ద ఎత్తున మట్టిని మైదానంలో డంప్ చేయడం తీవ్ర విమర్శలకు తావు ఇస్తున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ పాలసీ, ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యమంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం..చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. క్రీడాభివృద్ధి కోసం బడ్జెట్లో కోట్లాది రూపాయాలు కేటాయించామని గొప్పలకు పోతున్న ప్రభుత్వం ఉన్న స్టేడియాలను కమర్షియల్ ఈవెంట్లకు ఇస్తుండటంపై పలువురు క్రీడాభిమానులు వ్యతిరేకిస్తున్నారు.. ఈ సూపర్‌క్రాస్ రేసింగ్‌కు సంబంధించి టికెట్ల రూపంలో అభిమానుల నుంచి దండుకునేందుకు నిర్వాహకులు గచ్చిబౌలిని ఎంచుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తున్నారు. 250 రూపాయలు మొదలుకుని 500, 1000 వరకు మూడు కేటగిరీల్లో టికెట్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) మద్దతుతో జరుగుతున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి..నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా సూపర్‌క్రాస్ రేసింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నాడు. మొత్తంగా కమర్షియల్ ఈవెంట్ల పేరుతో స్టేడియాలను దుర్వినియోగం చేయడాన్ని ఇకనైనా ఆపాలని క్రీడాకారులు, అభిమానులు కోరుకుంటున్నారు.