అబుదాబి : అందరూ ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్.. ఐపీఎల్ మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టాడు. వచ్చే సీజన్ కోసం అబుదాబిలో మంగళవారం నిర్వహించిన వేలంలో గ్రీన్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడ్డా చివరికి ఆక్షన్‌లో అత్యధిక పర్స్ వాల్యూ (రూ. 64.30 కోట్లు)తో ఎంట్రీ ఇచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్.. అతడిని ఏకంగా రూ. 25.20 కోట్ల రికార్డు ధర (నిబంధనల ప్రకారం అతడికి దక్కేది రూ. 18 కోట్లు)కు సొంతం చేసుకుంది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా ఈ కంగారూ ఆల్‌రౌండర్.. తన దేశానికే చెందిన మిచెల్ స్టార్క్ (2024లో రూ. 24.75 కోట్లు) రికార్డును బ్రేక్ చేశాడు. లంక పేసర్, మొన్నటి సీజన్ దాకా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఆడిన మతీశ పతిరాన (రూ. 18 కోట్లు) సైతం రికార్డు ధర పలికాడు. ఎవరూ ఊహించని విధంగా దేశవాళీలు, స్థానిక లీగ్‌ల్లో దుమ్మురేపిన రాజస్థాన్ కుర్రాడు కార్తీక్ శర్మ, ఉత్తరప్రదేశ్ సంచలనం ప్రశాంత్ వీర్ కోసం చెన్నై ఏకంగా రూ. 14.20 (తలా ఒక్కొక్కరికి) వెచ్చించింది. ఆ జట్టు ఈసారి పూర్తిగా ‘జెన్‌జీ’ మంత్రం జపించడం విశేషం.
77 స్లాట్స్ కోసం 369 మంది ఆటగాళ్లు అదృష్టాన్ని పరీక్షించుకున్న వేలంలో కొంతమందికి అనూహ్య ధర దక్కింది. హయ్యస్ట్ ప్రైస్ పలికిన వారిలో టాప్-3 భారత క్రికెటర్లలో ముగ్గురూ అన్క్యాప్డ్ ఆటగాళ్లే కావడం విశేషం. ముఖ్యంగా ‘డాడీస్ ఆర్మీ’గా పేరున్న సీఎస్కే.. పూర్తిగా యువ మంత్రం జపించింది. పేరున్న, సీనియర్ జోలికి వెళ్లని చెన్నై.. అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితా రాగానే కుర్రాళ్లపై కోట్లు కుమ్మరించింది. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి వేటలో ఉన్న చెన్నై.. 20 ఏండ్ల ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ కోసం పోటీపడింది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి వచ్చిన అతడి కోసం లక్నో, ముంబై, రాజస్థాన్ కూడా పోటీపడ్డాయి. ‘సిక్స్ హిట్టింగ్ మిషిన్’గా గుర్తింపుపొందిన కార్తీక్ కోసం చెన్నై, కేకేఆర్ నువ్వానేనా అంటూ తలపడ్డా చివరికి అతడు సీఎస్కేకే సొంతమయ్యాడు. జమ్ముకాశ్మీర్ పేసర్ అకిబ్ నబీ (రూ. 8.4 కోట్లు) కూడా జాక్‌పాట్ కొట్టాడు. 30 లక్షల ధరతో ఉన్న అతడి కోసం సన్‌రైజర్స్, ఢిల్లీ పోటీపడ్డాయి. రంజీలతో పాటు స్మాట్లోనూ సత్తాచాటుతున్న ఈ పేస్ ఆల్‌రౌండర్‌ను ఢిల్లీ సొంతం చేసుకుంది.మంగేశ్ యాదవ్ (రూ. 5.20 కోట్లు), సలీల్ అరోరా (రూ. 1.5 కోట్లు), అశోక్ శర్మ (రూ. 90 లక్షలు), జార్ఖండ్ స్పిన్నర్ సుశాంత్ మిశ్రా (రూ. 90 లక్షలు) మంచి ధరలు దక్కించుకున్నారు.

నిరుటి సీజన్లో రూ. 23.75 కోట్లు) కోల్‌కతాకు ఆడిన వెంకటేశ్ అయ్యర్ ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడనున్నాడు. వేలంలో ఆర్సీబీ అతడిని రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్లో లక్నోకు ఆడిన రవి బిష్ణోయ్.. రూ. 7 కోట్లతో రాజస్థాన్‌కు వెళ్లాడు. మొదటి ప్రయత్నంలో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపించని లియామ్ లివింగ్స్టొన్ను హైదరాబాద్ ఏకంగా రూ. 13 కోట్లకు దక్కించుకుంది. తొలిసారి ‘అన్‌సోల్డ్’గా మిగిలిన సర్ఫరాజ్, పృథ్వీ షా, రచిన్ రవీంద్ర వంటి ఔత్సాహిక క్రికెటర్లను తర్వాతి దశలో ఫ్రాంచైజీలు కనికరించాయి.

ఐపీఎల్లో ఒకప్పుడు మెరుపులు మెరిపించిన స్టార్ ప్లేయర్లకు ఈ సీజన్లో నిరాశే ఎదురైంది. జానీ బెయిర్ స్టో (ఇంగ్లండ్), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్ (ఆస్ట్రేలియా), భారీ ధర పలుకుతాడని ఆశించిన జెమీ స్మిత్ (ఇంగ్లండ్), గెరాల్డ్ కొయెట్జ్, దీపక్ హుడా వంటి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
ఐపీఎల్ వేలం ముగిసిన నేపథ్యంలో తర్వాతి సీజన్‌కు సంబంధించిన వివరాలూ బహిర్గతమయ్యాయి. 19వ సీజన్ 2026 మార్చి 26 నుంచి మే 31 వరకు జరుగనుంది. అయితే సంప్రదాయం ప్రకారం డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో ఉన్న జట్టు తమ హోంగ్రౌండ్లో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉండగా.. నిరుటి సీజన్ విజేత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంత వేదిక అయిన చిన్నస్వామిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు.

వేలంలో తెలంగాణ యువ సంచలనం పేరాల అమన్‌రావును రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. రూ. 30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అమన్‌ను రాజస్థాన్ సొంతం చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున మెరుపులు మెరిపించిన అమన్.. ఇప్పటివరకూ 11 టీ20 మ్యాచ్‌లు ఆడి 33 సగటుతో 301 రన్స్ చేశాడు. ఈనెల 12న ముంబైతో మ్యాచ్‌లో అర్ధ శతకంతో రాణించాడు.

1 అన్క్యాప్డ్ ఆటగాళ్లలో కార్తీక్, ప్రశాంత్‌ది రికార్డు ధర. గతంలో ఈ రికార్డు అవేశ్ ఖాన్ (రూ. 10 కోట్లు) పేరిట ఉండేది.