Hardik-Natasha Divorce | టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. నాలుగేండ్ల క్రితం అంగరంగ వైభవంగా చేసుకున్న వివాహ బంధానికి గురువారం ఫుల్‌స్టాఫ్ పెట్టిన విషయం తెలిసిందే. ప్రేమించి పెండ్లి చేసుకున్న నటాషా స్టాంకోవిచ్‌తో అతడి వివాహ బంధానికి గురువారమే శుభం కార్డు పడింది. పదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్.. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హీరోగా గుర్తింపు పొందినా అతడి వైవాహిక జీవితం మాత్రం అంత విజయవంతమవలేదు. హార్దిక్ మాదిరిగానే పలువురు భారత మాజీ క్రికెటర్లు సైతం ఆటలో దిగ్గజాలుగా వెలుగొందినా పెళ్లిల్ల విషయంలో మాత్రం ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది.
దినేశ్ కార్తీక్:
తమిళనాడు క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఇటీవలే ఐపీఎల్ ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్ల ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2012లోనే కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నిఖితా విజయ్ను వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె మరో భారత మాజీ క్రికెటర్‌తో అఫైర్ పెట్టుకుందనే ఆరోపణలతో కార్తీక్.. నిఖితకు విడాకులిచ్చి ప్రముఖ స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌ను రెండో వివాహం చేసుకున్నాడు.
శిఖర్ ధావన్:
భారత క్రికెట్ అభిమానులు గబ్బర్‌గా పిలుచుకునే శిఖర్ ధావన్ 2012లో ఆస్ట్రేలియా పౌరసత్వం ఉన్న అయేశా ముఖర్జీని పెండ్లి చేసుకున్నాడు. కానీ 9 ఏండ్ల తర్వాత ఈ ఇద్దరూ విభేదాల కారణంగా తమ వివాహబంధానికి ఫుల్స్టాప్ పెట్టారు. 2023లో ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరుచేసింది.
మహ్మద్ అజారుద్దీన్:
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ 1987లో నౌరీన్‌తో నిఖా చేసుకున్నాడు. కానీ తొమ్మిదేండ్లకే ఆమెకు విడాకులిచ్చి 1996లొ ప్రముఖ బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానితో జట్టు కట్టాడు. సంగీతతో కూడా అజారుద్దీన్ ఒడిదొడుకుల ప్రయాణమే సాగించాడు. 2010లో ఈ ఇద్దరూ విడిపోయారు.
జవగళ్ శ్రీనాథ్:
టీమ్ఇండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్‌కు 1999లో జ్యోత్స్నతో పెళ్లి అయింది. కానీ 2007లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. 2008లో శ్రీనాథ్.. మాధవిని వివాహం చేసుకున్నాడు.
అనిల్ కుంబ్లే:
భారత క్రికెట్ అభిమానులు ‘జంబో’ అని పిలుచుకునే అనిల్ కుంబ్లేకూ రెండు పెళ్లిల్లు తప్పలేదు. 1986లో అతడు చేతన రామకీర్తనను పెళ్లాడాడు. ఈ దంపతులకు కూతురు ఆరుని పుట్టిన కొన్నాళ్లకు కుంబ్లే, చేతన మధ్య విభేదాలు తలెత్తాయి. కోర్టులో సుదీర్ఘకాలం విచారణ తర్వాత 1998లో కుంబ్లే విడాకులు తీసుకున్నాడు. అనంతరం కుంబ్లే 1999లో రచన అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
వినోద్ కాంబ్లి:
90వ దశకంలో సచిన్‌తో సమాంతరంగా క్రేజ్ దక్కించుకున్న అతడి స్నేహితుడు వినోద్ కాంబ్లి తన వ్యవహార శైలి కారణంగా కెరీర్‌తో పాటు వివాహబంధాన్ని నాశనం చేసుకున్నాడు. 1999లో నొయెల్లా లూయిస్‌ను పెళ్లి చేసుకున్న కాంబ్లీ.. కొద్దికాలానికే ఆమెతో విడిపోయాడు. అనంతరం ఫ్యాషన్ మోడల్ ఆండ్రియా హెవిట్‌తో రెండో ప్రయాణం మొదలుపెట్టినా ఆమె కూడా కాంబ్లీపై గృహహింస కేసు పెట్టింది.
మహ్మద్ షమీ:
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ పెళ్లి కూడా మూన్నాళ్ల ముచ్చటే అయింది. బెంగాల్‌కు చెందిన హసీన్ జహన్‌ను 2014లో పెళ్లాడిన షమీ.. 2020 తర్వాత ఆమెతో దూరంగా ఉంటున్నాడు. ఈ దంపతులకు ఒక కుమార్తె. వీరి విడాకులకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది.