ODI World Cup | భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా రెండ్రోజుల క్రితం అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు నిర్దేశించిన 285 పరుగుల లక్ష్య ఛేదనలో బట్లర్ సేన 215 పరుగులకే ఆలౌట్ అయి 69 పరుగుల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకున్నది. తాజాగా నెదర్లాండ్స్ కూడా.. సౌతాఫ్రికాకు షాకిచ్చింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డచ్ జట్టు నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీలు 207 రన్స్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ పసికూనలుగా బరిలోకి దిగి అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన జట్లు, ఆ వివరాలు తెలుసుకుందాం.
తొలి దెబ్బ ఆసీస్‌కే..
భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన 1983 లో ఆస్ట్రేలియా అప్పటికే అగ్రశ్రేణి జట్టు. అప్పుడు క్రికెట్లో వెస్టిండీస్ ఆధిపత్యం కొనసాగినా ఆసీస్ కూడా ప్రమాదకారే. కానీ పటిష్టమైన ఆసీస్‌కు జింబాబ్వే షాకిచ్చింది. నాటింగ్‌హోమ్ వేదికగా జింబాబ్వే – ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. 60 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. అనంతరం డెన్నిస్ లిల్లి, అలెన్ బోర్డర్, కిమ్ హ్యూగ్స్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న ఆసీస్.. 226 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలిచింది.
కరేబియన్లకు షాకిచ్చిన కెన్యా..
ఉపఖండం వేదికగా జరిగిన 1996 ప్రపంచకప్‌లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ కు కెన్యా షాకిచ్చింది. పూణెలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా.. 166 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ స్పిన్ కు అనుకూలించిన పిచ్‌పై కెన్యా స్పిన్నర్లు రెచ్చిపోయారు. విండీస్‌ను 73 పరుగులకే ఆలౌట్ చేశారు. కెన్యా సారథి మారిస్ ఒడుంబే.. మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలకపాత్ర పోషించాడు.
పాక్‌కు బంగ్లా షాక్..
1992 వరల్డ్ కప్ విజేత పాకిస్తాన్.. 1999లో అప్పుడప్పుడే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన బంగ్లాదేశ్ షాకిచ్చింది.. నార్తంప్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బంగ్లాను 223 పరుగులకే కట్టడి చేసిన పాకిస్తాన్ లక్ష్యఛేదనలో తడబడింది. ఆ జట్టు 161 పరుగులకే ఆలౌట్ అయింది.
ఐర్లాండ్ చేతిలోనూ పాక్‌కు చావుదెబ్బ..
2007 వన్డే ప్రపంచకప్ లో భాగంగా కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్.. పాకిస్తాన్ కు షాకిచ్చింది. ఈ పోరులో పాక్ జట్టు 132 పరుగులకే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని ఐర్లాండ్ అలవోకగా ఛేదించింది.
ఇంగ్లాండ్‌కు అప్పుడే..
భారత్ వేదికగా 2011లో ముగిసిన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టుకు ఐర్లాండ్ కోలుకోలేని షాకిచ్చింది. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 327 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఐర్లాండ్.. 49.1 ఓవర్లలోనే ఛేదించింది. కెవిన్ ఒబ్రెయిన్.. 63 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి ఐర్లాండ్‌కు సూపర్ డూపర్ విక్టరీని అందించాడు.