పారిస్ : ఫెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ మజీ నంబర్‌వన్ ప్లేయర్ డానియల్ మెద్వెదెవ్ పోరాటం ఆదిలోనే ముగిసింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆరో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 2-6,6-1,1-6,6-1,4-6తో ఆస్ట్రేలియా వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆడమ్ వాల్టన్ చేతిలో ఓడిపోయాడు. మరోవైపు ఫ్రాన్స్ నయా స్టార్ కౌమె 7-6(7-4), 6-2, 6-1తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలువగా, మెగా టోర్నీలో చివరిసారి బరిలోకి దిగిన లోకల్ స్టార్ మోనోఫిల్స్ 2-6, 3-6, 6-3, 6-2, 0-6తో తన దేశానికే చెందిన గాస్టన్ చేతిలో ఓడి టోర్నీకి గుడ్‌బై చెప్పాడు.
ఇక, మహిళల సింగిల్స్‌లో కొకో గాఫ్, సబలెంకా శుభారంభం చేశారు. తొలి రౌండ్లో డిఫెండింగ్ చాంప్ గాఫ్ 6-4, 6-0తో అమెరికాకే చెందిన టౌన్ సెండ్‌పై నెగ్గగా, టాప్ సీడ్ సబలెంకా (బెలారస్) 6-4, 6-2తో బౌజస్ (స్పెయిన్)పై గెలిచి ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌లో భారత పేయర్లు యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ శుభారంభం చేశారు. యూకీ-మైఖేల్ వీనస్ (న్యూజిలాండ్) 7-5, 6-2తో సెరుండోలో- మరియానో (అర్జెంటీనా)ను ఓడించగా.. శ్రీరామ్-మార్సెలో (బ్రెజిల్)6-3, 4-6, 6-3 తేడాతో ఫ్రాంట్జెన్ (జర్మనీ)- రాబిన్ హాసే (నెదర్లాండ్స్)పై గెలిచింది.