బెంగళూరు : వన్డేలలో ఒక జట్టు అంతా కలిసి 300 పరుగుల స్కోరు చేయడానికి ఎంతో శ్రమించాలి. కానీ ముంబైకి చెందిన 14 ఏండ్ల యువ క్రికెటర్ ఇరా జాదవ్ మాత్రం.. ఒక్కతే 346 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేలలో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. మహిళల అండర్-19 ట్రోఫీలో భాగంగా ఆలూరు (బెంగళూరు)లో జరుగుతున్న ఈ టోర్నీలో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న ఇరా.. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో 157 బంతుల్లోనే 42 బౌండరీలు, 16 సిక్సర్లతో 346 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. వన్డేలలో భారత్ తరఫున ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే సౌతాఫ్రికా బ్యాటర్ లిజెల్లె లీ (427- 2010లో సౌతాఫ్రికా దేశవాళీ అండర్-19 టోర్నీలో) అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఇరా నిలిచింది. భారత్ నుంచి అండర్-19 వన్డే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్లలో ప్రస్తుత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (224) ఉంది. ఇరా విధ్వంసకర త్రిశతకంతో మంధాన రికార్డు కనుమరుగైంది.