కోయంబత్తూరు: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్)లో భాగంగా జరిగిన ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ డ్రైవర్ అకిల్ అలీభాయ్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ సీజన్ ఆరు రౌండ్లలో విజేతగా నిలిచిన అకిల్.. ఆదివారం ఇక్కడ నిర్వహించిన చివరి రెండు రౌండ్లలో 2,3 స్థానాల్లో నిలిచినప్పటికీ ట్రోఫీకి అవసరమైన పాయింట్లు సొంతం చేసుకోవడంతో అతడు చాంపియన్‌గా నిలిచాడు.
ప్రముఖ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగచైతన్య బ్లాక్‌బర్డ్స్‌కు యజమానిగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఇక ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ట్రోఫీని గోవా ఏసెస్ జేఏ జట్టు దక్కించుకుంది. చివరి రేసులో ఆ జట్టు డ్రైవర్లు రౌల్ హైమాన్, గాబ్రియేలా జిల్కోవా 1,2వ స్థానాల్లో నిలవడమే గాక గోవా చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు.