Aishwarya Rai | కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వివాదంలో చిక్కుకున్నాడు. తన నోటి దూలతో వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఓ వార్తాసంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో షాహిద్ అఫ్రిదీ, ఉమర్ గుల్‌తో కలిసి పాల్గొన్న రజాక్..అనవసరంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ను లాగాడు. మెగాటోర్నీలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన గురించి మాట్లాడాల్సింది పోయి..ఐశ్వర్యపై చౌకబారు వ్యాఖ్యలు చేశాడు.
‘గత కొన్ని రోజులుగా పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. నేను ఆడే రోజుల్లో కెప్టెన్‌గా యూనిస్‌ఖాన్ జట్టును అద్భుతంగా నడిపించేవాడు. యూనిస్‌తో పాటు సహచరుల నుంచి నేను స్ఫూర్తి పొందేవాడిని. కానీ ప్రస్తుతం జట్టులో అలాంటి పరిస్థితి లేదు. అసలు పీసీబీ ఏం చేస్తుందో తెలియడం లేదు’ అని అన్నాడు. అంతటితో ఆగకుండా పీసీబీని విమర్శిస్తూ ‘మీరు ఐశ్వర్యరాయ్‌ను పెండ్లి చేసుకుంటే మంచి పిల్లలు పుడుతారు అనుకుంటారు. కానీ ఎప్పటికీ అలా జరుగదు’ అని అన్నాడు. రజాక్ తీరును అందరూ తీవ్రంగా ఎండగడుతున్నారు.