ఆసియా కప్‌లో భారత జట్టు ప్రయాణం దాదాపు ముగిసింది. అయితే సూపర్-4 దశలో వరుసగా రెండు మ్యాచుల్లో టీమిండియా ఓడిపోవడం మాజీలకు మింగుడుపడటం లేదు. జట్టు కూర్పులో ఉన్న లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా జట్టు ఎంపికను తప్పుబట్టాడు.
అద్భుతంగా ఆడుతున్నాడని జట్టులోకి తీసుకున్న ఫినిషర్ దినేష్ కార్తీక్‌ను డ్రెస్సింగ్ రూంలో కూర్చోబెడితే లాభం ఏంటని వీరూ ప్రశ్నించాడు. ఒకటో రెండో ఓవర్లు బౌలింగ్ చేయడానికే హుడాను ఎంచుకుంటే ఆ పని కోహ్లీ, రోహిత్ కూడా చేయొచ్చని చెప్పిన సెహ్వాగ్..‘‘ఒక ఫినిషర్ అయితే చివరి నాలుగు బంతుల్లో రెండు బౌండరీలు కొట్టగలడు కదా.
అసలు డీకేను పక్కనపెట్టి హుడాను ఎందుకు సెలెక్ట్ చేశారో ఆ లాజిక్ నాకు అంతుబట్టడం లేదు. 37 ఏళ్ల వయసు ఉన్న ఫినిషర్‌ను జట్టులోకి తీసుకొని, అతన్ని పక్కనపెట్టడం ఏంటి? డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటే అతను మ్యాచ్‌లను ఎలా ఫినిష్ చేస్తాడు?’’ అని సూటిగా అడిగాడు.
అలాగే సీనియర్ బౌలర్లు జట్టులో లేనప్పుడు ఒక 15-20 పరుగులు ఎక్కువ చేయాలని, అప్పుడు యువ బౌలర్లు వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారని వివరించాడు. అంతేకానీ అనుకున్న టార్గెట్ కూడా చేరుకోకపోతే ఎలా అన్నాడు.
లంకతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 190 పరుగులు కొట్టేలా కనిపించిందని, కానీ చివరకు 170 పరుగులతో సరిపెట్టుకుందని విమర్శించాడు. హుడా బౌలింగ్ చెయ్యకపోతే ఫినిషర్ ఆడేవాడు కదా? అని అడిగాడు.