Harbhajan Singh | ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా చిక్కుల్లో పడ్డారు. మూడు రోజుల క్రితం ఎడ్జ్‌బాస్టన్ (ఇంగ్లండ్) వేదికగా ముగిసిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ నెగ్గిన తర్వాత ఈ ముగ్గురూ బాలీవుడ్ పాట ‘తౌబా తౌబా’కు స్టెప్పులేసిన రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం. వీడియోలో ఈ ముగ్గురూ నడుము పట్టుకుని కుంటుకుంటూ చేసిన డాన్స్ వివాదాస్పదమైంది.
ఈ వీడియోపై పారా అథ్లెట్ మానసి జోషి ‘దివ్యాంగులంటే మీకు అంత చులకనా?’ అని ఎక్స్‌లో మండిపడింది. పలు హక్కుల కార్యకర్తల సంఘాలు సైతం క్రికెటర్ల తీరును తప్పుబట్టడంతో భజ్జీ నష్ట నివారణ చర్యలకు దిగాడు. 15 రోజుల పాటు క్రికెట్ ఆడాక తాము అలిసిపోయామని తెలియచెప్పడానికే అలా చేశామని అంతే తప్ప ఎవరినీ బాధపెట్టడానికి కాదంటూ వివరణ ఇచ్చుకున్నాడు.