ఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు, ఐఎస్ బింద్రాగా అందరికీ సుపరిచితుడైన ఇంద్రజిత్ సింగ్ బింద్రా (84) తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన కన్నుమూశారు. 1993 నుంచి 1996 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) అధ్యక్షుడిగా 1978 నుంచి 2014 వరకూ ఏకంగా 36 సంవత్సరాల పాటు కొనసాగారు.
పీసీఏకు ఆయన అందించిన సేవలకు గాను మొహాలీలోని పీసీఏ స్టేడియానికి 2015 తర్వాత ఐ.ఎస్. బింద్రా స్టేడియంగా పేరు మార్చారు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా బింద్రాకు అపార అనుభవముంది. వరుసగా మూడు ఎడిషన్ల తర్వాత వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ ఆవల, అదీ ఉపఖండాన (1987) నిర్వహించడంలో నాటి ఐసీసీ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియాతో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారు. దాల్మియా హయాంలో ఆయన ఐసీసీ ప్రిన్సిపల్ అడ్వైజర్‌గానూ సేవలందించారు.
క్రికెట్ ప్రసారాల్లో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా 1994లో బింద్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందుకు అనుకూలంగా వచ్చిన తీర్పుతోనే భారత క్రికెట్లో ఈఎస్పీఎన్, టీడబ్ల్యూఐ వంటి సంస్థలు భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. బింద్రా మృతిపై ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హస్, సెక్రటరీ దేవ్జిత్ సైకియా నివాళులర్పించారు.