ఢిల్లీ: ఫుట్‌బాల్‌లో ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ 57 ఏండ్ల (1967లో చివరి సారిగా) తర్వాత ప్రతిష్ఠాత్మక సంతోశ్ ట్రోఫీ ఫైనల్స్‌కు ఆతిథ్యమివ్వనుంది. 78వ సీనియర్ నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ ఫైనల్ రౌండ్ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తెలిపింది. డిసెంబర్ 14 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో 31వ తేదీన ఫైనల్ జరుగనుంది. లీగ్ దశ, క్వార్టర్స్ పోటీలకు దక్కన్ ఎరీనా ఆతిథ్యమివ్వనుండగా సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతాయి. 2023-24 సీజన్లో గ్రూప్ విజేతలుగా నిలిచిన 9 జట్లు (వెస్ట్‌బెంగాల్, మణిపూర్, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఒడిశా, మేఘాలయ), ఫైనలిస్టులు (సర్వీసెస్, గోవా), ఆతిథ్య తెలంగాణ (మొత్తం 12 జట్లు) రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. రెండు గ్రూపులలో తొలి 4 స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. సంతోశ్ ట్రోఫీలో ఇప్పటి వరకూ బెంగాల్ రికార్డు స్థాయిలో 32 సార్లు విజేతగా నిలవడం గమనార్హం. కానీ 2016-17 తర్వాత ఆ జట్టు మళ్లీ టైటిల్ గెలువలేదు.