ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ పొలికేక పెట్టింది. కొరియా చేతిలో అనూహ్య ఓటమి నుంచి తొందరగానే తేరుకున్న పోర్చుగల్.. ప్రిక్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ను ఉతికి ఆరేసింది. స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డోను దాదాపు రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేసిన పోర్చుగల్ గొంజాలో రామోస్ అనే కొత్త అస్ర్తాన్ని దిగ్విజయంగా ప్రవేశపెట్టింది.
అవకాశాన్ని ఆలంబనగా మలుచుకున్న రామోస్ హ్యాట్రిక్ గోల్స్‌తో స్విస్ జట్టుపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. మైదానంలో చిరుతను తలపిస్తూ స్విస్ రక్షణశ్రేణిని ప్రేక్షక పాత్రకు పరిమితం చేస్తూ మూడు కండ్లు చెదిరే గోల్స్‌తో అదరగొట్టాడు. రామోస్‌కు తోడు సహచరుల విజృంభణతో పోర్చుగల్ ఆరు గోల్స్ కొట్టి అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చిన పోర్చుగల్ మెగాటోర్నీలో మూడోసారి క్వార్టర్స్ పోరుకు అర్హత సాధించి మొరాకోతో పోరుకు సిద్ధమైంది.
లుసైల్(ఖతార్): ఫిఫా ప్రపంచకప్ టైటిల్ వేటలో పోర్చుగల్ మరో అడుగు ముందుకేసింది. కొరియాతో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అనూహ్య ఓటమి ఎదుర్కొన్న పోర్చుగల్.. స్విట్జర్లాండ్‌తో ప్రిక్వార్టర్స్ పోరులో జూలు విదిల్చింది. తాము మనసు పెట్టి ఆడితే ప్రత్యర్థికి ఓటమే అన్న తరహాలో విజృంభించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఏకపక్ష పోరులో పోర్చుగల్ 6-1 తేడాతో స్విట్జర్లాండ్‌పై భారీ విజయం సాధించింది. పోర్చుగల్ తరఫున గొంజాలో రామోస్(17ని, 51ని, 67ని), పెపె(33ని), రాఫెల్ గురెరో(55ని), రాఫెల్ లియో(90+ని) గోల్స్ చేశారు.
మాన్యుల్ అకాంజీ(58ని) స్విస్‌కు ఏకైక గోల్ అందించాడు. మ్యాచ్‌లో ఆది నుంచే తమదైన ఆధిపత్యం ప్రదర్శించిన పోర్చుగల్ మెరుపు దాడులకు దిగింది. స్విస్ రక్షణ శ్రేణిని కకావికలు చేస్తూ గోల్స్ వర్షం కురిపించింది. మ్యాచ్ 17వ నిమిషంలో రామోస్ గోల్‌తో పోర్చుగల్ ఖాతా తెరిచింది. స్విస్ గోల్‌కీపర్ యాన్ సోమర్‌ను కంగుతినిపిస్తూ బంతిని బుల్లెట్లా పోస్ట్‌లోకి పంపాడు. ఇక్కణ్నుంచి తమ దాడులకు మరింత పదునుపెంచిన పోర్చుగల్ స్విస్ డిఫెన్స్ లోపాలను తమకు అనుకూలంగా మలుచుకుంది.
ఈ క్రమంలో బ్రూనో ఫెర్నాండెజ్ కొట్టిన కార్నర్ కిక్‌ను వెటరన్ ప్లేయర్ పెపె సూపర్ హెడర్గోల్ కొట్టడంతో ఆధిక్యం 2-0కు పెరిగింది. స్పష్టమైన ఆధిపత్యం కనబరిచిన పోర్చుగల్ కీలకమైన ద్వితీయార్ధంలో ఎక్కడా వెనుకకు తగ్గకుండా స్విస్పై విరుచుకుపడింది. దాదాపు 15 నిమిషాల వ్యవధిలో రామోస్, గురెరో, లియో వరుస విరామాల్లో గోల్స్ చేయడంతో స్కోరు అమాంతం పెరిగింది. గోల్ చేసిన ప్రతీసారి స్టేడియంలో ఉన్న అభిమానులు ‘రొనాల్డో..రొనాల్డో’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అయితే మ్యాచ్ మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా పెపె స్థానంలో రొనాల్డో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. అప్పటి వరకు డగౌట్‌కు పరిమితమైన ఈ స్టార్ స్ట్రైకర్ వచ్చి రావడంతోనే దూకుడు కనబరిచాడు. మెరుపు వేగంతో గోల్ చేసినా.. రిఫరీ ఆఫ్‌సైడ్ అని తేల్చడంతో నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత సహచరులందరూ సంబురా ల్లో ఉంటే.. రొనా ల్డో మాత్రం ఒకింత నిరాశతో మైదానాన్ని వీడటం కనిపించింది. ఇదిలా ఉంటే పోర్చుగల్ తరఫున నాలుగో మ్యాచ్ ఆడిన రామోస్ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.
క్వార్టర్ ఫైనల్ షెడ్యూల్
డిసెంబర్ 9
క్రొయేషియా X బ్రెజిల్, రాత్రి 8.30
అర్జెంటీనా X నెదర్లాండ్స్, అర్ధరాత్రి 12.30
డిసెంబర్ 10
పోర్చుగల్ X మొరాకో, రాత్రి 8.30
ఇంగ్లండ్ X ఫ్రాన్స్, అర్ధరాత్రి 12.30