కాబో వెర్డె.. ఆరు లక్షల జనాభా కూడా లేని దేశం. భూభాగం చూస్తే ప్రపంచంలో రెండో చిన్న దేశం.. వనరులు పరిమితం.. కరువు కొరల్లో అక్కడ జీవనమే గగనం..ఇలాంటి పరిస్థితుల నుంచి ఆ దేశం ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించడమే అద్భుతం. అలాంటిది సాకర్‌లో శక్తివంతమైన జట్లలో ఒకటైన స్పెయిన్‌ను నిలువరించిన కాబో అందరి ప్రశంసలు అందుకుంది . బ్లూ షార్క్స్ (నీలి తిమింగలాలు) గా పేరొందిన కాబో టీమ్ ఫిఫా కప్‌లో తమ అరంగేట్రం మ్యాచ్‌లోనే మాజీ చాంపియన్‌ను వణికించి సాకర్ ప్రపంచంలో ప్రకంపనలు పుట్టించింది. ఆ్రఫ్రికా ఖండంలోని ఈ చిరు దేశ నేపథ్యం, జట్టు ప్రయాణం అత్యంత ఆసక్తికరం!
నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : ప్రపంచ పటంలో కొన్ని మ్యాప్‌లు కాబో వెర్డెను అసలు గుర్తించనే లేవు. ఆఫ్రికా ఖండంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో విసిరేసినట్లు ఉండే 10 చిన్న ద్వీపాల సముదాయమే ఈ దేశం. 1462 నుంచి 1975 వరకు దాదాపు 513 ఏండ్ల పాటు పోర్చుగల్ పాలనలో నలిగింది. సొంత దేశంలో ఉన్న జనాభా కంటే నెదర్లాండ్స్, పోర్చుగల్, అమెరికాలో నివసిస్తున్న కాబో వెర్డె ప్రవాసుల సంఖ్యే (15 నుంచి 20 లక్షలు) ఎక్కువ. దీనికి కారణం అక్కడి దుర్భర వాతావరణం. ఆ దేశంలో అస్సలు వర్షాలు పడవు. ఉపాధి కోసం వలసలు సహజం. 19వ శతాబ్దంలో తిమింగలాల వేట కోసం వెళ్లిన అమెరికా నౌకల ద్వారా కాబోవెర్డె ప్రజలు పలు దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. వనరులు లేని ఆ ప్రజలకు ఫుట్‌బాల్ మాత్రమే మిగిలిన ఏకైక ఆత్మగౌరవంగా మారింది. సముద్ర తీరాల వెంబడి, చిన్న పట్టణాల్లోని ఇసుక మైదానాల్లో ఫుట్‌బాల్ ఆడుతూ పెరిగిన యువతే ఈ రోజు జాతీయ జట్టుకు కొండంత బలం అయ్యారు. మరోవైపు పోర్చుగల్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో స్థిరపడిన కాబో వెర్డె మూలాలున్న ఆటగాళ్లు సైతం జాతీయ జెర్సీ ధరించేందుకు ముందుకొచ్చారు. ఈ అరుదైన కలయికతో ఏర్పడిన జట్టే ‘బ్లూ షార్క్స్’.
ప్రతీ మ్యాచ్‌ను యుద్ధంలా..
ప్రపంచకప్ అర్హత పోటీలు ప్రారంభమైనప్పుడు కాబో వెర్డెను పెద్దగా ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు. ఆఫ్రికా ఖండంలోని బలమైన జట్ల మధ్య ఈ చిన్న దేశం నిలబడగలదా అనే సందేహాలే ఎక్కువగా వినిపించాయి. కానీ బ్లూ షార్క్స్ ప్రతి మ్యాచ్‌ను యుద్ధంలా తీసుకున్నారు. స్వదేశంలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో నెగ్గడమే కాకుండా ప్రత్యర్థుల మైదానాల్లోనూ పంజా విసిరారు. క్రమశిక్షణతో కూడిన డిఫెన్స్, మెరుపు వేగంతో చేసే దాడులు, ఆటగాళ్ల మధ్య గొప్ప సమన్వయం కాబోవెర్డె ప్రధాన బలాలు. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో బలమైన కామెరూన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన రోజు కాబో వెర్డె ద్వీపాలన్నీ సంబరాల్లో మునిగిపోయాయి.
మహాశక్తిని నిలువరించి..
తొలిసారి ఫిఫా ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కాబో వెర్డెకు ఆరంభ పోరులోనే మాజీ ప్రపంచ చాంపియన్ స్పెయిన్‌తో అసలు పరీక్ష ఎదురైంది. స్పెయిన్ జట్టులో ప్రపంచ స్థాయి క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. బంతిపై ఆధిపత్యం, పాస్‌లతో ఆటను నియంత్రించే నైపుణ్యం,అనుభవం అన్నీ ప్రత్యర్థికే అనుకూలంగా కనిపించాయి. దాంతో స్పెయిన్ గెలవడం పక్కా.. అది ఎన్ని గోల్స్ తేడాతో చూడాలని అంతా అనుకున్నారు. కానీ మైదానంలో కాబో వెర్డె ఆటగాళ్లు వేరే కథ రాశారు. ఫస్ట్ విజిల్ నుంచి లాస్ట్ విజిల్ వరకు అసాధారణ క్రమశిక్షణతో ఆడారు. స్పెయిన్ వరుస దాడులు చేసినప్పటికీ రక్షణలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
గోల్ కీపర్ వొజిన్హా కీలక సేవ్‌లతో ప్రత్యర్థిని నిరాశపరిచాడు. ప్రతి టాకిల్, ప్రతి క్లియరెన్స్, ప్రతి అడ్డుకట్టలో కాబోవెర్డె ఆటగాళ్లలో కసి, పట్టుదల కనిపించింది. 90 నిమిషాల పోరాటం అనంతర ఫలితం స్పెయిన్ జట్టుకు నిరాశకలిగించే డ్రానే కావొచ్చు. కానీ, కాబో వెర్డెకు అది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ప్రపంచకప్ వేదికపై తొలి మ్యాచ్‌లోనే ఒక ఫుట్‌బాల్ మహాశక్తిని నిలువరించడం ద్వారా బ్లూ షార్క్స్ టీమ్ సాకర్ ప్రపంచానికి గట్టి సందేశం పంపాయి. జనాభా పరిమాణం.. దేశ విస్తీర్ణం కాదు.. అవకాశాలను ఎలా వినియోగించుకుంటామన్నదే విజయాన్ని నిర్ణయిస్తుందని నిరూపించింది.ఈ ఫలితంతో కాబో వెర్డె ఇప్పటికే సాకర్‌లో ఓ చరిత్రను లిఖించింది. ఇకపై ఆ జట్టు సాధించేదంతా బోనస్!
కాబోలో రొనాల్డో కుటుంబ మూలాలు
ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు కాబో వెర్డెతో రక్తసంబంధం ఉంది. రొనాల్డో తండ్రి వైపు ముత్తాత కాబో వెర్డెలోని ‘శావో విసెంటి’ ద్వీపానికి చెందినవారు కావడం గమనార్హం.

40 ఏండ్ల వయసులో..
స్పెయిన్ కొట్టిన 27 దాడులను ఒంటిచేత్తో అడ్డుకుని, 7 అద్భుతమైన సేవ్‌లతో హీరోగా నిలిచిన 40 ఏండ్ల వెటరన్ గోల్‌కీపర్ వోజిన్హా ఇప్పుడు ప్రపంచకప్ స్టార్‌గా మారిపోయాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ కెరీర్‌ను 25 ఏండ్ల లేటు వయసులో ప్రారంభించిన వోజిన్హా ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న ఓల్డెస్ట్ ప్లేయర్ల జాబితాలో రొనాల్డో (41 ఏండ్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. కానీ వయసుతో సంబంధం లేకుండా జట్టును ముందుండి నడిపించి, ప్రపంచ వేదికపై తన దేశ కలను నిజం చేశాడు. మ్యాచ్‌కు ముందు అతని ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కేవలం 50 వేల లోపు ఉన్న ఫాలోవర్ల సంఖ్య.. ఆట ముగిసిన కొద్దిసేపటికే 24 లక్షలకు పెరిగింది.