వరల్డ్ కప్ చరిత్రలో మెస్సీకి ఇది 20వ గోల్. ఆల్‌టైమ్ జాబితాలో ఫ్రాన్స్ స్టార్ ఎంబాపె (18)కంటే రెండు గోల్స్ ఆధిక్యంలో మెస్సీ అగ్రస్థానంలో ఉన్నాడు.
2022 ప్రపంచకప్ నుంచి ఇప్పటివరకు వరుసగా 8 వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో గోల్స్ కొట్టిన ఏకైక ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు. ఈ 8 మ్యాచ్‌ల వ్యవధిలోనే అతడు ఏకంగా 12 గోల్స్ సాధించాడు.
మెస్సీకి ఇది ఓవరా ల్గా 124వ అంతర్జాతీయ గోల్. పోర్చుగల్ స్టార్ రోనాల్డో (146) మాత్రమే అతడి కంటే ముందున్నాడు.
సాకర్ సూపర్ స్టార్, అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ ఫిఫా వరల్డ్ కప్‌లో ఖతర్నాక్ ఆటతో అదరగొడుతున్నాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ అభిమానులను అలరించాడు. ఈ మెగా టోర్నీలో మెస్సీ మొత్తంగా ఏడో గోల్‌తో మెరిసిన వేళ అర్జెంటీనా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. అయితే అది అంత సులువుగా కాదు. ఆఫ్రికా చిరు దేశం, తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న కాబో వెర్డె అడ్డు దాటేందుకు చాలా కష్టపడింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో మహాశక్తిలాంటి అర్జెంటీనాను కాబో ఓ ఆటాడుకుంది. ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడి మ్యాచ్‌ను ఎక్స్ట్రా టైమ్‌కు తీసుకెళ్లింది. చివర్లో సెల్ఫ్ గోల్ కొట్టి ఆ జట్టు వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించగా.. మెస్సీసేన ఊపిరిపీల్చుకుంది.
మయామి గార్డెన్స్: ఫిఫా ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనాకు రౌండ్-32 నాకౌట్ పోరులో కాబో వెర్డె నుంచి ఊహించని సవాల్ ఎదురైంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఉత్కంఠ పోరులో మెస్సీసేన 3-2 తో కాబోపై గెలిచి గట్టెక్కింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, లిసాండ్రో మార్టినెజ్ గోల్స్ కొట్టగా.. కాబో తరఫున డెరాయ్ డువార్టే, సిడ్నీ కాబ్రాల్ గోల్స్ చేశారు. కానీ, ఎక్స్ట్రా టైమ్‌లో కాబో ఆటగాడు బోర్జెస్ చేసిన ఓన్ గోల్ అర్జెంటీనాను గండం నుంచి తప్పించింది. మంగళవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌తో అర్జెంటీనా పోటీ పడనుంది.
గ్రూప్ దశలో స్పెయిన్, ఉరుగ్వే వంటి బలమైన జట్లను నిలువరించి క్లీన్ షీట్లు సాధించిన కాబో వెర్డె రక్షణ శ్రేణి ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు చూపెట్టింది. అయితే 29వ నిమిషంలోమార్టినెజ్ అందించిన లాంగ్ బాల్‌ను అద్భుతంగా నియంత్రించిన కెప్టెన్ మెస్సీ చాకచక్యంగా గోల్ కొట్టి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి దాడులను నిలువరించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాబో రెండో అర్ధభాగంలో తన ఆటతీరును మార్చుకుని ఎటాకింగ్‌కు దిగింది. ఈ క్రమంలో 52వ నిమిషంలో మెండెస్ అందించిన పాస్‌ను ఆ జట్టు కెప్టెన్ డువార్టే గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. అదే సమయంలో 40 ఏండ్ల కీపర్ వోజిన్హా గోల్ పోస్టు వద్ద అర్జెంటీనాకు అడ్డు గోడలా నిలబడ్డాడు. మెస్సీ కొట్టిన రెండు అద్భుతమైన ఫ్రీ కిక్‌లను అద్భుతంగా అడ్డుకున్నాడు.
నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారితీసింది. ఎక్స్ట్రా టైమ్ ప్రారంభమైన రెండు నిమిషాల లోపే (91 నిమిషాల 59 సెకన్లకు) మెస్సీ వేసిన కార్నర్‌ను అలిస్టర్ ఫ్లిక్ చేయగా, అక్కడ సిద్ధంగా ఉన్న మార్టినెజ్ ఎడమకాలితో మెరుపు గోల్ కొట్టి అర్జెంటీనాకు 2-1 ఆధిక్యం అందించాడు. ఈ గోల్‌తో మెస్సీసేన విజయం ఖాయమే అనిపించింది. కానీ, కాబో లొం గిపోలేదు. కొద్దిసేపటికే ఆ జట్టు ఆటగాడు సిడ్నీ కాబ్రాల్ (103వ ని) ఒక అద్భుతమైన కర్లింగ్ షాట్‌తో బంతిని టాప్ కార్నర్‌లోకి పంపి స్కోరు 2-2తో సమం చేసి షాకిచ్చాడు. చివరకు 111వ నిమిషంలో మెస్సీ వేసిన ప్రమాదకరమైన కార్నర్ కిక్‌ను రొమేరో హెడర్ ద్వారా కొట్టగా, అది కాబో డిఫెండర్ బోర్జెస్ తలకు తగిలి ఓన్ గోల్‌గా మారింది. ఈ లక్కీ గోల్‌తో అర్జెంటీనా ముందంజ వేసింది.
6 లక్షల జనాభా కూడా లేని కాబో వెర్డె ఈ మెగా టోర్నీ ద్వారా తమ సత్తాను ప్రపంచానికి చాటుకుంది. గ్రూప్ దశలో స్పెయిన్, ఉరుగ్వేతో డ్రా చేసుకొని ప్రకంపనలు సృష్టించిన ఆ జట్టు నాకౌట్లో డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనాను ఎక్స్ట్రా టైమ్ వరకు నెట్టి ఔరా అనిపించింది. చివరకు ఓడినా ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
వరల్డ్‌కప్‌లో మొరాకో తొలి క్వార్టర్‌ఫైనల్ బెర్తు సొంతం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఆ జట్టు 3-0తో సహ అతిథ్య జట్టు కెనడాను చిత్తుగా ఓడించింది. అజెడిన్ ఔనహి (50, 82వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టగా.. సోఫియానే రహిమి (90+8వ ని) ఓ గోల్ రాబట్టాడు కాగా ఈజిప్ట్ జట్టు తొలిసారి నాకౌట్ మ్యాచ్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠపోరులో షూటౌట్లో 4-2తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్ చేరుకుంది.మరో మ్యాచ్‌లో కొలంబియా1-0 తేడాతో ఘనాను ఓడించింది.