భారత చదరంగ చరిత్రలో నూతన అధ్యాయం! అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ ప్రతిష్టాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆఖరి పోరులో వెటరన్ గ్రాండ్‌మాస్టర్ కొనేరు హంపిపై యువ సంచలనం దివ్య చిరస్మరణీయ విజయం సాధించింది. ప్రపంచకప్ టైటిల్ దక్కించుకున్న తొలి భారత ప్లేయర్‌గా దివ్య అరుదైన రికార్డు కొల్లగొట్టింది. సోమవారం జరిగిన రెండు ర్యాపిడ్ గేముల్లో హంపితో తొలి గేమును డ్రా చేసుకున్న దివ్య..మలిగేమ్లో అద్భుత విజయం సొంతం చేసుకుంది. తన కెరీర్లో తొలిసారి మేజర్ టైటిల్ గెలిచిన ఆనందంలో దివ్య ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ తల్లిని ఆలింగనం చేసుకుంది. ఈ విజయంతో గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న ఐదో భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది. దివ్య చారిత్రక విజయంతో జార్జియాలో మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడింది.
బతుమి(జార్జియా): ప్రపంచ చెస్ యవనికపై భారత్ మరోమారు తమదైన ముద్ర వేసింది. చెస్‌పై తమ ఆధిపత్యాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకుంటూ ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత్ విజయదుందుభి మోగించింది. సోమవారం జరిగిన మెగాటోర్నీ ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ 2.5-1.5 తేడాతో కోనేరు హంపిపై అద్భుత విజయం సాధించింది. తొలుత రెండు క్లాసిక్ గేమ్‌లు డ్రా కాగా, విజేతను నిర్ణయించేందుకు జరిగిన ర్యాపిడ్ గేమ్‌లో దివ్యను విజయం వరించింది. మొదట ర్యాపిడ్ గేమ్ 0.5-0.5తో డ్రా అయ్యింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన 19 ఏండ్ల తన కంటే వయసులో పెద్దదైన హంపి(38)పై ఆధిక్యం ప్రదర్శించేందుకు ప్రయత్నించింది.
తొలి టైబ్రేక్‌లో క్వీన్ పాన్‌తో ఎత్తు వేసిన దివ్య పాన్‌ను కోల్పోయింది. దీంతో హంపికి మెరుగైన అవకాశం లభించింది. అయితే చాన్స్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయిన హంపి..రూక్, బిషప్, పాన్‌తో దివ్య క్వీన్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నించి సఫలమైంది. దీంతో హంపికి సులువుగా డ్రా దక్కింది. రిటర్న్ టైబ్రేక్‌లో క్యాటలాన్ ఓపెనింగ్‌ను ఎంచుకున్న హంపికి నల్లపావులతో దివ్య దీటుగా బదులిచ్చింది. మొదట్లోనే పాన్‌ను కోల్పోయిన హంపి క్లీన్ అండ్ రూక్తో ఎత్తు వేసింది. గేమ్ 40వ ఎత్తులో తడబాటుకు గురైన హంపి పాన్ కోల్పోయింది. ఇదే అదనుగా గేమ్‌పై పట్టు సాధించిన దివ్య..హంపికి మళ్లీ అవకాశమివ్వలేదు.
ఓవైపు సమయం ముంచుకొస్తుండగా ఆఖర్లో హంపి చేసిన మరో తప్పిదం దివ్యకు వరమైంది. గేమ్‌లో కడదాకా ఇద్దరి మధ్య పోరు డ్రా లేదా గెలుపు ఎవరిదన్న తరహాలో సాగగా, ఆఖరికి దివ్యనే విజయం వరించింది. ఈ క్రమంలో ఈ యువ ప్లేయర్ తన కెరీర్లో చిరస్మరణీయ గెలుపును ఖాతాలో వేసుకుంది. తన కంటే వయసులో రెండింతలు పెద్దదైన హంపిపై గెలిచిన తర్వాత భావోద్వేగానికి గురైన దివ్య.. తన తల్లిని హత్తుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఫిడే మహిళల ప్రపంచకప్-2025 గెలుచుకోవడంతో దివ్యకు గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కింది. ఈ క్రమంలో ఆమె భారత్ నుంచి జీఎం హోదా దక్కించుకున్న ఐదో మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. దివ్య కంటే ముందు సుబ్బరామన్ విజయలక్ష్మీ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి ఈ హోదా కలిగి ఉన్నారు. మొత్తంగా భారత్ నుంచి ఈ ఘనత సాధించినవారిలో దివ్య 88వ క్రీడాకారిణిగా నిలిచింది.
అది 1970వ దశకం, ఖాదిల్కర్ అక్కాచెల్లెళ్ల త్రయం చదరంగంలో విశేషంగా రాణిస్తున్నారు. వారు మగవారితో కలిసి పోటీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. కానీ పలువురు అభ్యంతరం చెప్పారు. చివరకు వాళ్ల తండ్రి ప్రసిద్ధ మరాఠీ పత్రిక ‘నవకాల్’ అధినేత కావడం వల్ల అప్పట్లో ఫిడే అధ్యక్షుడు అయిన మాక్స్ ఐవేను ప్రత్యేక అనుమతి కోరి వారిని అంతర్జాతీయ క్రీడాకారిణీలు అయ్యేందుకు తోడ్పడ్డారు. అప్పట్లో మహిళా చదరంగ ప్లేయర్లు చాలా తక్కువ. వారి విజయాలను ఎవరూ పట్టించుకోలేదు.
కానీ నేడు ఖాదిల్కర్ సోదరీమణుల త్రయం నిజంగా ఆనంద డోలికల్లో మునిగిపోయుండొచ్చు! తమ రాష్ర్టానికి చెందిన 19 ఏండ్ల అమ్మాయి దివ్య దేశ్‌ముఖ్.. భారతీయ చదరంగానికి గత మూడు దశాబ్దాలుగా మకుటం లేని మహారాణిగా వెలుగొందుతున్న కోనేరు హంపిని మట్టికరిపించి ప్రపంచకప్ టైటిల్ గెలవడం వారి ఆనందానికి కారణం. అంతేగాకుండా ప్రస్తుత వరల్డ్ చాంపియన్ ఛాలెంజర్ పోటీలకు అర్హత సాధించడం, భారత 88వ గ్రాండ్‌మాస్టర్‌గా ఎదగడ ం చెస్ అభిమానులను సంతోషం కల్గిస్తున్నది.
ఒకప్పుడు మహిళా గ్రాండ్‌మాస్టర్ భారత్ నుంచి అవుతారా? అని విశ్లేషకులు సందేహం వ్యక్తం చేసిన వేళ తెలుగు సంతతికి చెందిన చెన్నై అమ్మాయి సుబ్బరామన్ విజయలక్ష్మీ గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి ప్రపంచ మహిళా చదరంగంపై తొలి సంతకం చేసింది. ఆ స్ఫూర్తితోనే హంపి.. కొన్నేండ్లపాటు చదరంగాన్ని శాసించింది. అదే దారిలో హారిక, వైశాలి నిల్చారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఈ యువ కెరటం దివ్య దూసుకొచ్చింది. చదరంగం ఎత్తులతోనే కాకుండా తన వినయంతో లేశ మాత్రం కూడా గర్వం లేని ఆమె వ్యక్తిత్వం అందర్నీ ఆకర్షించింది.
హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యురాలైన దివ్యను అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఈ టోర్నమెంట్ ఆరంభంలోనూ ఆమెపై పెద్దగా అంచనాల్లేవు. కేవలం ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాలో బరిలోకి దిగిన దివ్య.. ప్రతి రౌండ్లో తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఆరో రౌండ్లో మాజీ ప్రపంచ చాంపియన్, చైనాకు చెందిన థాన్ జోన్గీని ఓడించి ఫైనల్స్ చేరింది. అంతకుముందు తన సహచరి గ్రాండ్ ఉమెన్స్ మాస్టర్ వైశాలిని, 4వ సీడ్ జున్నార్నూ ఓడించి సత్తా చాటింది. చివరకు వరల్డ్ ర్యాపిడ్ చాంపియన్ హంపితో తుదిపోరుకు సిద్ధమైంది.
ఫైనల్స్‌లో ఇద్దరు భారత మహిళలు పోటీపడటం ప్రపంచ చదరంగ చరిత్రలోనే ప్రథమం. ఈ పోటీపై ప్రపంచ చదరంగ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే హంపి అపార అనుభవం ముం దు దివ్య నిలబడటం సాధ్యమేనా అని విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఈ యువ క్రీడాకారిణి పోటీకి సిద్ధమైంది.
హంపితో జరిగిన తొలి పోరులో దివ్య ఆద్యంతం ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కానీ హంపి తన అనుభవంతో నిలువరించి పోటీని డ్రాగా ముగించింది. గెలుపు అవకాశాలు చేజార్చుకున్నందుకు దివ్య నిరాశ చెందింది. రెండో గేమ్‌లో హంపి కొంత ఆధిక్యతను ప్రదర్శించడంతో దివ్య తన పకడ్భందీ వ్యూహంతో డ్రా గా ముగించింది. దీంతో విజేతను టైబ్రేక్ ద్వారా నిర్ణయించాల్సి వచ్చింది.
ఫైనల్లో మొదటి గేమ్‌ను తెల్లపావులతో ఆడిన దివ్య డ్రాగా ముగించింది. నిర్ణయాత్మక రెండో గేమ్‌లో దివ్య అసలైన ఆటను ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇరువురూ కొదమసింహాల్లా తలపడ్డారు. క్షణక్షణానికి విజయావకాశాలు తారుమారు అవుతూ విజయం ఇద్దిరతో దోబూచులాడింది. చివరకు అద్భుతమైన ఎండ్‌గేమ్ టెక్నిక్‌తో దివ్య చాంపియన్‌గా అవతరించింది. ఇంత కీలకమ్యాచ్‌లో హంపి ఇటువంటి తప్పిదం చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. అయితే దివ్య ప్రదర్శించిన స్ఫూర్తిదాయకమైన ఆటతీరును ఆయన ప్రశంసల్లో ముంచెత్తాడు.
విజయం సాధించిన వెంటనే దివ్య తన వెన్నంటి ఉండి ముందు నడిపించిన అమ్మను కౌగిలించి ఆనందబాష్పాలను రాల్చింది. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యం చూసి ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగింది.
ప్రపంచ చదరంగ చరిత్రలోనే ఈ పోటీ చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ఒకవైపు తన మాతృత్వం కోసం కొద్దికాలం పాటు విరామం తీసుకుని తిరిగి బరిలోకి దిగిన 38 ఏండ్ల హంపి.. మరో వైపు ఆమె కంటే వయసులో సగం వయసు ఉన్న దివ్య మరో తరానికి ప్రాతినిథ్యం వహించింది. రెండు తరాల పోరులో యువతరం గెల్చింది. ప్రపంచ చదరంగానికి ఒక యువరాణి దొరికింది.
ఎన్నో అసమానతలను ఎదుర్కునే మహిళలకు వీరిద్దరి విజయాలు స్ఫూర్తిదాయకం. క్రికెటర్లు సచిన్, కోహ్లీ, శుభమన్ గిల్, రిషభ్ పంత్ కొన్ని దేశాల్లో తెలిసుండొచ్చు. కానీ ఈ ఇద్దరు రాణులను మాత్రం చదరంగం ఉన్నంతవరకూ ప్రపంచ దేశాల ప్రజలెవరూ మర్చిపోరు.
విజేత: దివ్య రూ.43.35 లక్షలు
రన్నరప్: హంపి రూ.30.34 లక్షలు
ప్రతిష్టాత్మక ఫిడే ప్రపంచకప్‌లో ఇద్దరు భారత మహిళలు పోటీపడుతున్న ఈ దృశ్యం అద్భుతం! విజేతగా నిలిచిన దివ్య దేశ్ముఖ్తో పాటు రన్నరప్ హంపికి అభినందనలు. ప్రపంచ వేదికపై భారత సత్తాను ప్రదర్శించిన ఈ ఇద్దరు మహిళలకు సలామ్.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఈ విజయాన్ని ఆస్వాదించేందుకు మరింత సమయం కావాలి. ఈ టోర్నీకి ముందు కనీసం నా కెరీర్లో ఒక జీఎం నార్మ్ కూడా లేదు. కానీ ప్రపంచకప్ టైటిల్ విజయంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది. ఇప్పుడు నార్మ్‌తో పాటు ఏకంగా గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్నాను. ప్రస్తుతం నేనేమి మాట్లాడలేకపోతున్నాను. ఇది నాకు ఎంతో అపురూపమైన విజయం. జీవితంలో సాధించాల్సిన విజయాలు ఇంకా చాలా ఉన్నాయి.
– దివ్య దేశ్‌ముఖ్
ఫిడే మహిళల ప్రపంచకప్ గెలిచిన తొలి భారత మహిళా ప్లేయర్ దివ్యదేశ్ముఖ్కు హృదయపూర్వక అభినందనలు. 19 ఏండ్ల వయసులోనూ ఈ ఫీట్ అందుకోవడం అద్భుతం. రన్నరప్ హంపికి శుభాకాంక్షలు. ప్రపంచకప్‌లో ఇద్దరు పోటీపడటం మన దేశ మహిళల సత్తా ఏంటో చూపెడుతున్నది. భవిష్యత్‌లో దివ్య, హంపి మరిన్ని విజయాలతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయడంతో పాటు యువతకు ఆదర్శంగా నిలుస్తారన్న నమ్మకం ఉంది.
-రాష్ట్రపతి ద్రౌపది ముర్ము