భారత హాకీ జట్టు అద్భుతం చేసింది! పారిస్ ఒలింపిక్స్‌లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. పునర్వైభవానికి టోక్యో ఒలింపిక్స్‌లో బీజం పడగా..పారిస్ విశ్వక్రీడల్లో తమ సత్తాఏంటో చేతల్లో చూపెట్టింది. సెమీస్‌లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమ్ఇండియా.. స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో బెబ్బులిలా గర్జించింది. గాయపడ్డ సింహాన్ని తలపిస్తూ స్పెయిన్‌పై పంజా విసిరింది. హర్మన్‌ప్రీత్‌సింగ్ డబుల్ ధమాకాతో మరోమారు నాయకునిలా ముందుండి నడిపిస్తే.. పెట్టని కోటగోడలా శ్రీజేశ్ ప్రత్యర్థికి సింహస్వప్నంలా నిలిచాడు. ఆఖరి సెకన్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో భారత్ కాంస్య కాంతులు విరజిమ్మింది. 52 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలతో కొత్త చరిత్రకు నాంది పలికింది. అసమాన ప్రతిభతో దేశానికి ఎన్నో చిరస్మరణీయాలు అందించడంలో కీలకమైన శ్రీజేశ్ డబుల్ ఒలింపియన్‌గా కెరీర్‌కు వెలుగు జిలుగులు అద్దుకున్నాడు. మొత్తంగా పడుతూలేస్తూ సాగుతున్న భారత ఒలింపిక్ ప్రయాణంలో హాకీలో కాంస్య పతకం కొత్త ఊపిరి ఊదింది. కోట్లాది భారతీయ అభిమానుల గుండెలు ఉప్పొంగేలా చేసిన హాకీ వీరులు ప్రశంసల జడివానలో తడిసిముద్దవుతున్నారు. ప్రధాని మొదలు సామాన్యుల వరకు హాకీ విజయాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు.
Hockey India | పారిస్: ఒలింపిక్స్ హాకీలో భారత్‌ది ఘనమైన చారిత్రక వారసత్వం. హాకీ అంటే భారత్..భారత్ అంటే హాకీ అనే రీతిలో ఆటను శాసించిన తీరు గత చరిత్ర చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 1928 అమెస్టర్‌డామ్ ఒలింపిక్స్ నుంచి మొదలుపెడితే నేటి పారిస్ విశ్వక్రీడల వరకు భారత హాకీ రికార్డులను టచ్ చేసిన వాళ్లు లేరు. ఈ ఘనమైన చర్రితలో భారత్ ఏకంగా 8 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్య పతకాలతో ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉన్నది. 1968(మెక్సికో), 1972(మ్యూనిచ్) ఒలింపిక్స్ తర్వాత 52 ఏండ్లకు వరుసగా టోక్యో(2020), పారిస్(2024) విశ్వక్రీడల్లో టీమ్ఇండియా పతకాలు కొల్లగొట్టి నయా చరిత్ర లిఖించింది. మ్యాచ్ విషయానికొస్తే గురువారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 2-1 తేడాతో స్పెయిన్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్(30ని, 33ని) డబుల్ గోల్స్‌తో అదరగొట్టగా, కెప్టెన్ మార్క్ మిరాలెస్(18ని) స్పెయిన్‌కు ఏకైక గోల్ అందించాడు.
స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్ తన దమ్ము ఏంటో చూపెట్టాడు. మెగాటోర్నీలో సూపర్ ఫామ్‌మీదున్న హర్మన్‌ప్రీత్ స్పెయిన్‌తో కీలక పోరులోనూ అదే జోరు కనబరిచాడు. సెమీస్‌లో జర్మనీ చేతిలో ఓటమి నుంచి తొందరగానే తేరుకున్న టీమ్ఇండియా..స్పెయిన్‌కు ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ చేజార్చుకోవద్దనే పట్టుదలతో బరిలోకి దిగింది. దీనికి తోడు గోల్‌కీపర్ శ్రీజేశ్ సుదీర్ఘ కెరీర్‌కు ఘనమైన వీడ్కోలు పలికేందుకు సహచర ప్లేయర్లందరూ గట్టిగా ప్రయత్నించారు. తొలి క్వార్టర్లో కొంత మందకోడిగానే కదిలిన భారత దళాలు..రెండో క్వార్టర్లో తమ ఆటతీరుకు పదును పెట్టారు. అయితే 18వ నిమిషంలో డీసర్కిల్లో మన్‌ప్రీత్‌సింగ్ చేసిన తప్పుతో దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ను మిరాలెస్ గోల్‌గా మలువడంతో స్పెయిన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కణ్నుంచి తమ గేర్ మార్చిన టీమ్ఇండియా..స్పెయిన్ గోల్పోస్ట్లకు దాడులకు దిగింది. రెండో క్వార్టర్స్ ముగుస్తుందన్న తరుణంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. మూడో క్వార్టర్ మొదలైన మూడో నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకోంటూ హర్మన్ గోల్‌గా మలువడంతో భారత్ ఆధిక్యం 2-1కు చేరుకుంది. ఓవైపు తమ ఆధిక్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు స్పెయిన్ ఫార్వర్డ్ దాడులను భారత్ దీటుగా తిప్పికొట్టింది. కీలకమైన నాలుగో క్వార్టర్లో దూకుడు పెంచిన స్పెయిన్..గోల్ లక్ష్యంగా భారత్‌పై దాడులు ముమ్మరం చేసింది. గోల్ కోసం బంతిని అందుకుని వేగంగా వెళుతున్న క్రమంలో స్పెయిన్ ప్లేయర్ అడ్డుతగలడంతో హార్దిక్సింగ్ భుజానికి గాయమైంది. అయితే కొద్ది విరామం తర్వాత తిరిగి అతను మైదానంలోకి వచ్చాడు.
భారత్, స్పెయిన్ మ్యాచ్‌లో ఆఖరి క్షణాలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగాయి. చివర్లో ఒత్తిడికి గురై ప్రత్యర్థికి గోల్స్ సమర్పించుకునే లక్షణమున్న భారత్ ఈసారి ఆ తప్పును పునరావృతం చేయలేదు. మ్యాచ్ మరో 40 సెకన్లలో అయిపోతుందన్న తరుణంలో హర్మన్‌ప్రీత్‌సింగ్ ఫౌల్‌తో దక్కిన వరుస పెనాల్టీ కార్నర్లను స్పెయిన్ వినియోగించుకోలేకపోయింది. ఓవైపు బలమైన రక్షణ శ్రేణికి తోడు గోల్‌కీపర్ శ్రీజేష్ అడ్డుగోడలా నిలువడంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం ఖరారైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీజేశ్ బొక్కాబోర్లా పడుకుని గోల్‌పోస్ట్‌కు దండం పెట్టాడు. మరోవైపు సహచరుల అంతా శ్రీజేష్‌కు గార్డ్ ఆఫ్ హానర్ తరహాలో సెల్యూట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక తన ట్రేడ్‌మార్క్ స్టయిల్లో శ్రీజేష్ గోల్‌పోస్ట్‌పై ఎక్కి అభిమానులకు అభివాదం చేయడం కనులవిందు చేసింది.
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత హాకీ జట్టుకు హాకీ ఇండియా(హెచ్ఐ) నజరానా ప్రకటించింది. గురువారం స్పెయిన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ చిరస్మరణీయ విజయం సాధించిన నేపథ్యంలో హెచ్ఐ ఈ నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండో విశ్వక్రీడల్లో పతకాన్ని అందించిన ప్లేయర్లు ఒక్కొక్కరికి రూ.15లక్షలు, సహాయక బృందంలో ఒక్కొక్కరికి రూ.7.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం ప్రకటించింది. ఈ విషయాన్ని హెచ్ఐ తమ అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించింది.
పరట్టు రవీంద్రన్ శ్రీజేశ్..క్లుప్తంగా పీఆర్ శ్రీజేశ్. భారత హాకీకి పెట్టని కోట గోడగా పేరొందిన శ్రీజేశ్ తన 18 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు చిరస్మరణీయ విజయంతో వీడ్కోలు పలికాడు. స్పెయిన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో చిరస్మరణీయ విజయం ద్వారా భారత్‌కు ఆఖరి ఆడ ఆడేశాడు. 2006లో జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన శ్రీజేశ్ 328 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇన్నేండ్ల సుదీర్ఘ ప్రయాణంలో భారత చారిత్రక విజయాల్లో శ్రీజేశ్‌ది కీలక పాత్ర. ప్రత్యర్థి జట్ల ప్లేయర్ల దాడులను కాచుకు కూర్చుంటూ గోల్‌పోస్ట్ ముందు గోడలా గోల్స్ అడ్డుకోవడంలోఅతనికి అతడే సాటిగా నిలిచాడు. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ టోక్యోలో భారత్ కాంస్యం గెలువడంలో అతను అన్నీతానై వ్యవహరించాడు. కీలకమైన సమయాల్లో సహచరుల్లో స్ఫూర్తిని నింపుతూ ప్రత్యర్థులకు సవాళ్లు విసరడంలోఅతని తర్వాతే ఎవరైనా. కోచింగ్ కోసం పెంచుకున్న ఆవును అమ్మిన అమ్మ.. శ్రీజేశ్ కెరీర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దింది. 1988, మే 8న కొచ్చిలో రవీంద్రన్, ఉష దంపతులకు జన్మించిన శ్రీజేశ్ అంచలంచెలుగా ఎదిగాడు. 2004లో భారత అండర్-21 జట్టుకు ఎంపికైన అతను ఆ తర్వాత రెండేండ్ల వ్యవధిలో జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. ఇక అక్కణ్నుంచి వెనుదిరిగి చూసుకోని శ్రీజేశ్ ప్రపంచంలోనే అత్యుత్తమ గోల్‌కీపర్‌గా మన్ననలు పొందాడు.