Virat Kohli | ఢిల్లీ: కోహ్లీ.. కోహ్లీ.. కోహ్లీ..! అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం ఎక్కడ చూసినా ఇవే అరుపులు. పుష్కరకాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు పోటెత్తారు. డొమెస్టిక్ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులను ఉచితంగా అనుమతించగా.. తమ ఆరాధ్య క్రికెటర్ ఆటను వీక్షించేందుకు జైట్లీ స్టేడియానికి ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలివచ్చారు. ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో కోహ్లీ ఆటను చూసేందుకు సుమారు 10 వేల మంది అభిమానులు వస్తారని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అంచనా వేసినా ఆ సంఖ్య 16 వేలు దాటినట్టు సమాచారం. గౌతం గంభీర్ స్టాండ్ (6 వేల సీటింగ్ సామర్థ్యం) పూర్తిగా నిండిపోవడంతో అదనపు గేట్లను తెరిచి బిషన్‌సింగ్ బేడీ స్టాండ్ (12 వేల సామర్థ్యం)లోనూ ఫ్యాన్స్‌ను అనుమతించారు.
ప్రేక్షకులు స్టేడియం లోపలికి వచ్చే సమయంలో కొంత తోపులాట కూడా జరిగింది. అయితే కోహ్లీ బ్యాటింగ్ చూద్దామనుకున్న అభిమానులకు.. మ్యచ్‌లో మొదట రైల్వేస్ బ్యాటింగ్ చేయ ఒకింత నిరాశకు గురి చేసింది. రైల్వేస్ తొలి రోజే ఆలౌట్ అవడంతో రెండో రోజు కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండటంతో అభిమానుల సంఖ్య మరింత పెరగొచ్చు. మొదటి రోజు బ్యాటింగ్‌కు రాకున్నా కోహ్లీ ఫీల్డింగ్‌లో తనదైన హావభావాలతో ఫ్యాన్స్‌ను అలరించాడు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించాడు.
తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు స్టేడియానికి భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను నియంత్రించేందుకు పారా మిలటరీ బలగాలను మోహరించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే బలగాల కండ్లుగప్పి ఒక అభిమాని మైదానంలోకి ప్రవేశిం కోహ్లీ కాళ్లు మొక్కే ప్రయత్నం చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫ్యాన్స్ పట్ల కఠినంగా వ్యవహరించవద్దని కోహ్లీ కోరాడు.