ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్లో అతిపెద్ద మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సూపర్ సండే ఫైట్‌లో తలపడబోయే టీమ్స్‌కు ఇద్దరు ఇండియన్ టీమ్ క్రికెట్ యోధులు కెప్టెన్సీ వహిస్తుండటమే ఇందుకు కారణం. ఓవైపు ఎమ్మెస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, మరోవైపు కోహ్లి కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ ఫైట్ జరగబోతోంది. పైగా ఈసారి ఈ రెండు టీమ్స్ టేబుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఆర్సీబీ టాప్‌లో ఉండగా.. సీఎస్కే మూడు విజయాలతో రెండోస్థానంలో ఉంది.
ధోనీ, కోహ్లి మధ్య ఫైట్ క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈసారి ఆర్సీబీ ఎప్పుడూ లేనంత ఫామ్‌లో ఉండటం, అటు సీఎస్కే మెల్లగా తన మునుపటి ఫామ్‌ను అందుకోవడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమన్న అంచనాకు ఫ్యాన్స్ వచ్చేశారు. సోషల్ మీడియాలో అప్పుడే ఈ మ్యాచ్‌కు సంబంధించి హడావిడి మొదలైపోయింది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.