హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ ఎన్సీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని ఈక్వెస్ట్రియన్ టీమ్ రిపబ్లిక్ డే హార్స్ షోలో ప్రతిభ కనబర్చి మొత్తం 10 పతకాలు కైవసం చేసుకుంది. దీంతో పాటు షో జంపింగ్ చాంపియన్ ఆఫ్ ది డే ట్రోఫీని కూడా ఒడిసి పట్టింది.
రిపబ్లిక్ డే హార్స్ షో పోటీల్లో భాగంగా ఢిల్లీలోని ఆర్మీ ఈక్వెస్ట్రియన్ నోడ్లో జరిగిన పోటీల్లో.. తెలంగాణ, ఏపీ ఎన్సీసీ డైరెక్టరేట్ పరిధిలోని ఈక్వెస్ట్రియన్ బృందం 3 స్వర్ణ, 4 రజత, 3 కాస్యం పతకాలు చేజిక్కించుకుంది. షేక్ రెహానా షో జంపింగ్ ఛాంపియన్ ఆఫ్ ది డే ట్రోఫీ దక్కించుకుంది. ఈ బృందంలో మహ్మద్ ముజఫర్, కొర్ర గణేష్, చిట్టేశ్రావు, లోహిత్, భాను కృష్ణ తదితరులున్నారు. మంచి ప్రతిభ కనపర్చిన క్యాడెట్లను ఎన్సీసీ అధికారులు అభినందించారు.