Follow Siraj Diet : ఇంగ్లండ్ గడ్డ మీద సంచలన ప్రదర్శనతో భారత జట్టుకు కొండంత అండలా నిలిచాడు మమ్మద్ సిరాజ్ (Mohammed Siraj). అలుపన్నదే ఎరుగకుండా ఐదుకు ఐదు టెస్టులు ఆడిన అతడి ఫిట్నెస్, చురుకుదనం చూసి దిగ్గజ ఆటగాళ్లు ఔరా అని ఆశ్చర్యపోయారు. ఓవల్ టెస్టులో ఐదో రోజు మియా భాయ్ స్పెల్ చూసి అతడి బౌలింగ్‌కు ఫిదా అయిన మాజీలు చాలామందే. ఇంగ్లండ్ మాజీ సారథి డేవిడ్ గోవర్ (David Gower) సైతం ఐదు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ జోష్‌కు, ఫిట్‌నెస్‌కు మంత్రముగ్దుడైపోయాడు. తమ జట్టు బౌలర్లు భారత పేసర్‌ను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని అంటున్నాడీ వెటరన్.
‘సిరాజ్ ఫిట్నెస్ అద్భుతం. మైదానంలో అతడి ఉత్సాహం ఇసుమంతైనా తగ్గినట్టు కనిపించదు. ఇరుజట్లలో ఐదుకు ఐదు టెస్టులు ఆడిన ఏకైక పేసర్ అతడే. అందుకే అతడు ఏం తింటాడో, ఏం తాగుతాడో తెలుసుకోవాలని ఉంది. సిరాజ్ పాటించే డైట్‌ను ఇంగ్లండ్ బౌలర్లకు ఇవ్వాలనుకుంటున్నా. ఓవల్ టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ పేస్ గన్ అలసట తెలియకుండా 30కి పైగా ఓవర్లు వేశాడు. కెప్టెన్ బంతి ఇవ్వడమే ఆలస్యం.. ఓకే అంటూ నిప్పులు చెరిగాడు. అతడిలో మ్యాచ్ గెలుపొందాలనే అసాధారణమైన కసి, పట్టుదల నేను చూశాను. ఫిట్నెస్ పరంగానూ సిరాజ్ అద్భుతం.
‘I want England bowlers to follow Mohammed Siraj’s diet’ – David Gower in awe of Indian pacer’s resilience
Details: 👉🏻 https://t.co/wajiG7WptT pic.twitter.com/wbcP4o2vDR
— CricTracker (@Cricketracker) August 12, 2025
కానీ, ఇంగ్లండ్ బౌలర్లు గతకొంత కాలంగా గాయాలతో బాధపడుతూనే ఉన్నారు. కెరీర్ ఆరంభం నుంచి సిరాజ్ గాయంతో జట్టుకు దూరమయ్యాడనే వార్త నేను వినలేదు. సో.. అతడిలాంటి ఫిటెనెస్ మావాళ్లకు ఉండాలి. కాబట్టే.. సిరాజ్ డైట్‌ను మా బౌలర్లకు సూచించాలని భావిస్తున్నా’ అని డేవిడ్ వెల్లడించాడు. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో టీమిండియా ప్రధాన అస్త్రం బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడగా.. సిరాజ్ బౌలింగ్ యూనిట్‌కు నాయకత్వం వహించాడు. ఓవల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడీ హైదరాబాదీ. మొత్తంగా 23 వికెట్లు తీసి తన పేస్ పవర్ చూపించాడు సిరాజ్.
సిరాజ్ డైట్ గురించి అతడి సోదరుడు మహ్మద్ ఇస్లాయిల్ (Mohammed Ismail) ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు ఏం చెప్పాడంటే…? ‘మా సోదరుడు సిరాజ్ ఆహారం విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడు. జంక్ ఫుడ్ అస్సలు తినడు. హైదరాబాద్‌లో ఉన్నా సరే బిర్యానీ కూడా అప్పుడప్పుడే తింటాడు. పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సిరాజ్ ధమ్ బిర్యానీ రుచి చూస్తాడు. అది కూడా ఇంట్లో వండినదై ఉండాలి.
పిజ్జా, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి జోలికి వెళ్లాడు. తన శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తాడు సిరాజ్. డైట్, ఫిట్నెస్.. ఒకదానితో ఒకటి ముడిపడిన ఈ రెండిటి విషయంలో అతడు క్రమశిక్షణను తప్పడు’ అని ఇస్మాయిల్ తన సోదరుడి ఫిట్నెస్ సీక్రెట్ వెల్లడించాడు.
ఓవల్‌లో ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించిన సిరాజ్