అప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా పెవిలియన్ చేరారు! ఇక మిగిలింది రెండే వికెట్లు..! తొలి మూడు టెస్టుల్లో ఏమాత్రం పోరాట పటిమ కనబర్చని ఇంగ్లండ్.. ఈసారి కూడా చేతులెత్తేయడం ఖాయమే అనుకున్నారంతా! ఆతిథ్య ఆసీస్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం చేరడం పక్కా అనుకుంటున్న దశలో ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్ తీవ్రంగా ప్రతిఘటించింది. చుట్టూ ఫీల్డర్లను మోహరించి నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్ చేస్తున్న స్పిన్ దాడిని తట్టుకుంటూ పది ఓవర్ల పాటు వికెట్ కాపాడుకొని సిడ్నీ టెస్టును ‘డ్రా’చేసుకుంది. ఇంగ్లిష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో క్రాలీ, స్టోక్స్ టాప్ స్కోరైర్లెనా.. అసలు హీరోలు మాత్రం లీచ్, బ్రాడ్, అండర్సన్ అనడంలో అతిశయోక్తి లేదు!
సిడ్నీ: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు ఆఖరికి ‘డ్రా’గా ముగిసింది. 388 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 30/0తో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. ఆట ముగిసే సమయానికి 270/9తో నిలిచింది. టాపార్డర్‌ను త్వరగానే పెవిలియన్ పంపిన ఆసీస్ బౌలర్లకు ఇంగ్లండ్ టెయిలెండర్లు సవాల్ విసిరారు. ఓపెనర్ జాక్ క్రాలీ (77), బెన్ స్టోక్స్ (60) అర్ధశతకాలు సాధించగా.. హమీద్ (58 బంతుల్లో 9), జో రూట్ (85 బంతుల్లో 24), బెయిర్‌స్టో (105 బంతుల్లో 41) తమ జిడ్డు బ్యాటింగ్‌తో ఓవర్లు కరిగించారు. మరో 10 ఓవర్ల ఆట మిగిలుండగా ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్ చేరిపోగా.. జాక్ లీచ్ (34 బంతుల్లో 26), స్టువర్ట్ బ్రాడ్ (35 బంతుల్లో 8 నాటౌట్) చక్కటి పోరాటం కనబర్చారు. చుట్టూ ఫీల్డర్లను పెట్టి కంగారూలు కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నించినా.. ఏమాత్రం బెదరకుండా డిఫెన్స్‌తో ఆకట్టుకున్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఆఖరి రెండు ఓవర్లను బ్రాడ్, అండర్సన్ (0 నాటౌట్) ఎదుర్కొన్న తీరు చూసి తీరాల్సిందే. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ 3, కమిన్స్, లియాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదిన ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో ఇప్పటికే తొలి మూడు టెస్టులు నెగ్గిన ఆతిథ్య ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకోగా.. శుక్రవారం నుంచి ఆఖరి పోరు ప్రారంభం కానుంది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 416/8 డిక్లేర్డ్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 294, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 265/6 డిక్లేర్డ్, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 270/9 (క్రాలీ 77, స్టోక్స్ 60; బొలాండ్ 3/30).