దశాబ్దాల తండ్లాట తీరుస్తూ.. క్రికెట్ పుట్టినిైల్లెన ఇంగ్లండ్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన యోధుడు.. అటు బ్యాట్‌తో ఇటు బంతితో ప్రత్యర్థిని బెంబేలెత్తించగల మొనగాడు.. వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడేండ్ల క్రితం లార్డ్స్ మైదానంలో మట్టికొట్టుకుపోయిన జెర్సీతో భారాన్నంతా భూజానేసుకొని ఇంగ్లిష్ టీమ్‌ను విశ్వవిజేతగా నిలిపిన బెంజమిన్ అండ్రే స్టోక్స్ వన్డేలకు వీడ్కోలు పలికాడు.
లండన్: జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేనున్నానంటూ ఆపద్బాంధవుడి పాత్ర పోషించిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు పగ్గాలు అందుకోవడం.. మూడు ఫార్మాట్లలో కొనసాగడం ఇబ్బందిగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచి ఒంటిచేత్తో ఇంగ్లండ్‌కు కప్పు కట్టబెట్టిన 31 ఏండ్ల స్టోక్స్ మంగళవారం దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడనున్నాడు. తన సొంత మైదానం డర్హంలో సఫారీలతో మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నట్లు స్టోక్స్ సోమవారం వెల్లడించాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 104 వన్డేలాడిన స్టోక్స్ 2919 పరుగులు చేసి 74 వికెట్లు పడగొట్టాడు.
జీరో నుంచి హీరో
2016 ఏప్రిల్ 03.. ఈడెన్ గార్డెన్స్ (కోల్‌కతా)లో టీ20 ప్రపంచకప్ ఫైనల్.. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 155/9 చేసింది.. ఛేదనలో విండీస్ 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. విండీస్ విజయానికి ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా.. బంతినందుకున్న స్టోక్స్ నాలుగు బంతుల్లో 4 సిక్సర్లు సమర్పించుకున్నాడు. అంతే యావత్ క్రీడాలోకం అతడిపై విమర్శల వర్షం కురిపించింది!
2019 జూలై 14.. లార్డ్స్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్.. తొలుత న్యూజిలాండ్ 50 ఓవర్లలో 241/8 స్కోరు చేసింది..ఛేదనలో ఇంగ్లండ్ 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ విఫలమైన చోట ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ స్టోక్స్ (84 నాటౌట్) అద్వితీయ పోరాటం కనబర్చి స్కోర్లు సమం చేశాడు. అనంతరం సూపర్ ఓవర్లోనూ ఇరు జట్లు సమంగా నిలువగా.. ఎక్కువ బౌండ్రీలు కొట్టిన కారణంగా ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించారు. దీంతో మూడేండ్ల క్రితం దుమ్మెత్తిపోసిన వాళ్లే పొగడ్తల్లో ముంచెత్తారు.