Hardik Singh | ఢిల్లీ: ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న హాకీ ప్లేయర్ హార్దిక్సింగ్ తమకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంటర్నెట్ సంచలనం ‘డాలీ చాయ్‌వాలా’కు ఉన్న గుర్తింపు సైతం తమకు లేదని, జాతీయ జట్టుకు ఏండ్లుగా ఆడుతున్నా అభిమానులు తమను కనీసం పట్టించుకోలేదని తెలిపాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో హార్దిక్ మాట్లాడుతూ.. ‘నేను నా సొంత కళ్లతో చూసిన విషయాన్ని మీకు చెబుతున్నాను.
పారిస్‌లో కాంస్య పతకం గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన మా బృందంలో నేను, హర్మన్‌ప్రీత్ సింగ్, మన్దీప్సింగ్తో పాటు ఐదారుగురం ఒకేచోట ఉన్నాం. మాతో పాటు డాలీ చాయ్‌వాలా కూడా అక్కడే ఉన్నాడు. అక్కడికి వచ్చిన ప్రజలు అతడితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడుతున్నారు. కనీసం మమ్మల్ని పట్టించుకునే నాథుడే కనిపించలేదు. ఇది చూసి మాకు ఒకింత ఇబ్బందిగా అనిపించింది. ఒక అథ్లెట్‌కు పేరు, డబ్బు కంటే అభిమానుల నుంచి గుర్తింపు దక్కినప్పుడు ఆ ఆనందాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. ఏ అవార్డూ దానికి సరితూగదు’ అంటూ ఆవేదన చెందాడు.