న్యూఢిల్లీ: గువాహటి వేదికగా అక్టోబర్ 6 నుంచి 11వ తేదీ వరకు జరుగనున్న బీడబ్ల్యూఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత్‌కు సులువైన డ్రా దక్కింది. శుక్రవారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) టోర్నీకి సంబంధించిన డ్రాను విడుదల చేసింది. ఇందులో రెండో సీడ్ భారత జట్టు గ్రూపు-హెచ్లో హాంకాంగ్, చైనా, నేపాల్, ఘనాతో కలిసి పోటీపడనుంది.
2008 తర్వాత తొలిసారి భారత్‌లో జరుగుతున్న టోర్నీలో మొత్తం 37 జట్లు బరిలో ఉన్నాయి. ప్రతీ గ్రూపులో టాప్‌లో నిలిచే జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. గ్రూపు-ఏలో టాప్‌సీడ్ థాయ్‌లాండ్‌తో పాటు డెన్మార్క్, స్లోవేనియా, కుక్ ఐస్లాండ్స్, డిఫెండింగ్ చాంపియన్ థాయ్‌లాండ్ ఉన్నాయి. ఈసారి టోర్నీలో కొత్త ఫార్మాట్‌తో పోటీలు జరుగనున్నాయి.
రిలే ఫార్మాట్లో 45 పాయింట్లు చేరుకున్న టీమ్..సెట్ గెలుచుకుంటుంది. బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన ప్లేయర్లు నేరుగా బీడబ్ల్యూఎఫ్ టోర్నీలో ఆడనుండగా, మిగిలిన బెర్తులను ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు జరిగే సెలెక్షన్ ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయనున్నారు.