మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాజీ చాంపియన్ నొవాక్ జకోవిచ్ జోరు కొనసాగిస్తున్నాడు. జకోతో పాటు కార్లొస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందంజ వేయగా ఆరో సీడ్ కాస్పర్ రూడ్‌కు షాక్ తగిలింది. 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న జకోవిచ్.. రికార్డు మ్యాచ్‌లో గెలిచి ఈ టోర్నీ మూడో రౌండ్‌కు ప్రవేశించాడు. బుధవారం మెల్బోర్న్లోని రాడ్లీవర్ ఎరీనాలో జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడో సీడ్ జకో..6-1, 6-7 (4/7), 6-3, 6-2తో పోర్చుగల్‌కు చెందిన జెమీ ఫెరియాను చిత్తు చేశాడు.
మ్యాచ్‌లో 14 ఏస్‌లు సంధించిన జకో.. 33 విన్నర్లు కొట్టాడు. 33 అనవసర తప్పిదాలు చేసిన సెర్బియా దిగ్గజం.. రెండో సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ తర్వాత పుంజుకుని ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. నొవాక్‌కు ఇది 430వ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ కావడం విశేషం.
టెన్నిస్‌లో ఓపెన్ ఎరా ప్రారంభమయ్యాక రోజర్ ఫెదరర్ (429) గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల రికార్డును జకో అధిగమించాడు. మిగిలిన మ్యాచ్‌లలో అల్కరాజ్.. 6-0, 6-1, 6-4తో నిషియొక (జపాన్) పై పెద్దగా కష్టపడకుండానే విజయం సాధించాడు. జ్వెరెవ్ (జర్మనీ) 6-1, 6-4, 6-1తో పెడ్రో మార్టిన్ (స్పెయిన్)ను ఓడించాడు. కాస్పర్ రూడ్.. 2-6, 6-3, 1-6, 1-4తో జాకుబ్ మెన్సిక్ (చెక్) చేతిలో నిష్క్రమించి ఇంటిబాట పట్టాడు.
మహిళల విభాగానికొస్తే హ్యాట్రిక్ టైటిల్ వేటలో ఉన్న ఒకటో సీడ్ అరీనా సబలెంక.. 6-3, 7-5తో జెస్సికా మనీరొ (స్పెయిన్)ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది. అమెరికా అమ్మాయి కోకో గాఫ్ 6-3, 7-5తో జోడీ అన్నా (యూకే)పై అలవోక విజయం సాధించింది.
జపాన్ ప్లేయర్ నవొమి ఒసాకా.. 1-6, 6-1, 6-3తో కరోలినా ముచోవా (చెక్)ను ఓడించింది. గత మూడేండ్లలో గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ ఆడుతూ మూడో రౌండ్‌కు చేరడం ఒసాకాకు ఇదే తొలిసారి. గత సీజన్ రన్నరప్ అయిన చైనా అమ్మాయి కిన్వెన్ జెంగ్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. రెండో రౌండ్లో జెంగ్ 6-7 (3/7), 3-6తో లారా సిగ్మండ్ (జర్మనీ) చేతిలో పరాభవం పాలైంది.