లండన్ : రెండున్నరేండ్ల క్రితం తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురై మరణం అంచులవరకూ వెళ్లినా.. ప్రస్తుతం జట్టులో కీలకసభ్యుడిగా మారిన టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రమాదంపై అతడికి వైద్యం చేసిన ప్రముఖ సర్జన్ డాక్టర్ దిన్షా పార్థివాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తనను ముంబైలోని దవాఖానాకు తీసుకొచ్చిన వెంటనే పంత్ డాక్టర్‌తో.. ‘నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా?’ అని అడిగాడట! ఇదే విషయమై పార్థివాలా స్పందిస్తూ.. “పంత్ చాలా అదృష్టవంతుడు. మొదటిసారిగా అతడిని హాస్పిటల్‌కు తీసుకొచ్చినప్పుడు పంత్ కాలిలో కుడి మోకాలి లిగ్మెంట్ స్థానభ్రంశం చెందింది. అంతేగాక లోపల చిన్నచిన్న గాయాలు చాలా అయ్యాయి. సర్వసాధారణంగా ఇటువంటి రోడ్డు ప్రమాద ఘటనల్లో మరణించే ఆస్కారమే ఎక్కువ. అయితే అంత పెద్ద ప్రమాదం జరిగినా పంత్ కుడి కాలి రక్తనాళాలు దెబ్బతినకపోవడం అతడి అదృష్టం. ఒకవేళ అవి దెబ్బతింటే మాత్రం పంత్ కాలిని పూర్తిగా తొలగించాల్సి వచ్చేది.
హాస్పిటల్‌కు తీసుకురాగానే పంత్ నాతో.. ‘నేను మళ్లీ క్రికెట్ ఆడగలనా డాక్టర్?’ అని ప్రశ్నించాడు. అతడి తల్లి మాత్రం.. ‘నా కొడుకు మళ్లీ నడవగలడా?’ అని అడిగింది. సర్జరీ తర్వాత పంత్ మొదట్లో చేతులు కూడా కదపలేకపోయాడు. కానీ క్రమంగా అతడు తన పనులు తాను చేసుకోగలిగాడు. నాలుగైదు నెలల తర్వాత ఊతకర్రలు లేకుండా నడవగలిగాడు’ అని తెలిపారు. 2022 డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న పంత్.. రూర్కీ వద్ద ప్రమాదానికి గురైన విషయం విదితమే. సుమారు 18 నెలల విరామం తర్వాత అతడు పూర్తిగా కోలుకుని మళ్లీ ఆటలోకి అడుగుపెట్టాడు. కాగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్‌తో పాటు ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో శతకాలు సాధించిన తర్వాత పంత్ చేసిన ‘సోమర్సాల్ట్’ విన్యాసం అతడికి అనవసరమని, అలాంటివి చేయకుండా ఉండటమే మంచిదని పార్థివాలా సూచించారు.