హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ హ్యాండ్బాల్ సంఘం లో నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. గత కొంత కాలంగా రెండు వర్గాల మధ్య నడుస్తున్న వివాదంలో సయోధ్య కుదిరింది. అర్శనపల్లి జగన్మోహన్రావు నేతృత్వంలోని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఏఐ)కే భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) గుర్తింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ హ్యాండ్బాల్ సంఘం(ఐహెచ్ఎఫ్), ఆసియా హ్యాండ్బాల్ సంఘం(ఏహెచ్ఎఫ్) మద్దతు కల్గిన హెచ్ఏఐ అధ్యక్షుడిగా దిగ్విజయ్ చౌతాలా, ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్రావును ఐవోఏ ప్రకటించింది.
జాతీయ ఒలింపిక్ సంఘం గుర్తింపుపై జగన్మోహన్రావు హర్షం వ్యక్తం చేశారు. హెచ్ఏఐపై నమ్మకముంచిన ప్రతీ రాష్ట్ర సంఘానికి, హ్యాండ్బాల్ కుటుంబసభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో హ్యాండ్బాల్ అభివృద్ధి ఎజెండాగా ముం దుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్లో జరుగబోయే ఆసియా క్రీడల్లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు.