Harbhajan Singh | హర్భజన్ సింగ్.. భజ్జీగా ఫ్యాన్స్‌కు అభిమాన క్రికెటర్.. 1998లో టెస్ట్ క్రికెట్లోకి అడుగు పెట్టిన భజ్జీ అతి తక్కువ టైంలోనే టీం ఇండియాలో కీలక బౌలరయ్యాడు. 31 ఏండ్లకే టెస్ట్ మ్యాచ్‌ల్లో 400 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. పలు మ్యాచ్‌ల్లోనూ తన స్పిన్ మాయజాలంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.. కానీ 2016 తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో కనిపించలేదు. నాటి నుంచి మళ్లీ సెలెక్టర్ల నుంచి పిలుపు వస్తుందని చాలా కాలం పాటు ఎదురుచూసిన ఈ ఆఫ్ స్పిన్నర్‌కు నిరాశే మిగిలింది. ఇక చేసేదేమీ లేక ఇటీవలే హర్బజన్ సింగ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు.
అలా అనూహ్యంగా జట్టుకు దూరం కావడం.. టీం ఇండియా జట్టులో చోటు దక్కక పోవడంపై భజ్జీ పెదవి విప్పాడు. 31 ఏండ్ల వయస్సులోనే 400 వికెట్లు తీసిన తనకు టీంలో చోటు లభించకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందన్నాడు. టీంలో తాను ఉండటం ఎవరికి సమస్య అయిందో.. తన తొలగింపులో ఎవరి ప్రమేయం ఉందో కూడా తెలియదన్నాడు.
400వ టెస్ట్ వికెట్ తీసిన తర్వాత వచ్చే ఎనిమిది, తొమ్మిదేండ్లలో వందకంటే ఎక్కువ వికెట్లు తీస్తానని భావించానని చెప్పాడు భజ్జీ.. కానీ తర్వాత టీంలోకి ఎంపిక చేయకపోవడంతో మ్యాచ్‌లు ఆడే అవకాశమే లేకుండా పోయిందన్నాడు. తాను జట్టులో కొనసాగడం ఎవరికి సమస్యగా మారిందన్న విషయం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుందన్నాడు. దీనిపై టీం ఇండియా సారధిగా మహేంద్ర సింగ్ ధోనీని అడిగితే ఏ సమాధానం రాలేదని చెప్పాడు. ఏదైనా అడిగినప్పుడు సమాధానం ఇవ్వకపోతే దాన్ని వదిలేయడమే మంచిదని స్పష్టం చేశాడు భజ్జీ.