Dhanashree Verma | టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌తో విడాకులపై ఆయన మాజీ భార్య, ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తొలిసారిగా స్పందించారు. విడాకుల సమయంలో కోర్టులో ఎదుర్కొన్న మానసిక వేదనను, ఆ తర్వాత జరిగిన టీ-షర్ట్ వివాదాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. కోర్టులో తీర్పు వెలువరించే సమయంలో ఆమె తన భావోద్వేగాలను కంట్రోల్ చేయలేక, అందరితో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. మంగళవారం ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్‌కాస్ట్‌లో ధనశ్రీ మాట్లాడింది. ‘విడాకుల రోజున మేమిద్దరం కూడా మానసికంగా సిద్ధమయ్యే ప్రయత్నం చేసాం. కానీ, తీర్పు ఇవ్వబోతున్నప్పుడు, నా భావోద్వేగాలను అదుపు చేయలేకపోయాను.
ఆ క్షణంలో నేను ఎంత బాధపడుతానో చెప్పలేక ఒక రకంగా ఏడ్చేశాను. ఆ తర్వాత చాహల్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు’ అని చెప్పింది. విడాకుల సమయంలో చాహల్ ధరించిన ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అని రాసి ఉన్న టీ-షర్ట్ పెద్ద వివాదాన్ని రేపింది. దీనిపై ధనశ్రీ స్పందిస్తూ ‘ఈ విషయంలో ప్రజలు నన్నే నిందిస్తారని మేం ముందే ఊహించాం. టీ-షర్ట్ గురించి తెలిసేలోపే.. నాపై నిందలు మోపుతారనే అభిప్రాయం ఏర్పడింది’ అని తెలిపింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత చాహల్ టీ-షర్ట్‌కి సంబంధించిన వీడియోలను చూసి ఆమె ఆశ్చర్యపోయానని చెబుతూ.. ‘అరే, వాట్సాప్‌లో చెప్పొచ్చు కదా! అలా ఎందుకు వేసుకున్నాడో?’ అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇలాంటి సున్నితమైన విషయాలను ఎంతో పరిపక్వతతో చూసుకోవాలని భావించానని అన్నారు. ‘ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనాలోచిత వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు. మా కుటుంబ విలువలను, అతని కుటుంబ గౌరవాన్ని కాపాడాలనే భావనతోనే అలా స్పందించాను’ అని పేర్కొన్నారు. సమాజంలో మహిళల పరిస్థితిని వివరిస్తూ ‘మహిళగా, బంధాన్ని నిలబెట్టుకోవాలని, అన్నింటినీ మినహాయించుకొని జీవనం సాగించాలని మనం నేర్చుకుంటాం. మన తల్లులు ఎంతో గౌరవంగా ఆ మాటలు చెప్పినట్లయితే, అది నిజమే’ అని తెలిపారు. పెళ్లి బంధంలో ఉన్నప్పుడు, తన భర్త చాహల్‌కు తాను అండగా నిలిచానని, చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు అతనితో అంగీకారంగా ఉంటూ ఎప్పుడూ కృషి చేశానని ధనశ్రీ గుర్తు చేసుకున్నారు. చాహల్, ధనశ్రీ వర్మ 2020లో వివాహం చేసుకున్న తర్వాత ఐదేళ్ల వివాహ బంధం ముగియడంతో ఈ విడాకులు తీసుకున్న విషయం ఇటీవల వార్తల్లో నిలిచింది.