తాజా సీజన్లో తన బంతులతో మ్యాజిక్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ మరోసారి విశ్వరూపం కనబర్చడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. కుల్దీప్ ధాటికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన కోల్‌కతా.. బౌలింగ్‌లో ఎలాంటి అద్భుతం కనబర్చలేక లీగ్‌లో వరుసగా ఐదో పరాజయం మూటగట్టుకుంది.
ముంబై: కుల్దీప్ స్పిన్ మాయాజాలానికి ముస్తఫిజుర్ పేస్ బలం తోడవడంతో మొదట కోల్‌కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఢిల్లీ.. ఆనక స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. గురువారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. నితీశ్ రాణా (34 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. శ్రేయస్ అయ్యర్ (42) రాణించాడు.
కోల్‌కతా బౌలర్లు కుల్దీప్ యాదవ్ (4/14), ముస్తఫిజుర్ రెహమాన్ (3/18) ధాటికి.. ఆరోన్ ఫించ్ (3), వెంకటేశ్ అయ్యర్ (6), బాబా ఇంద్రజిత్ (6), నరైన్ (0), రస్సెల్ (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికే పృథ్వీ షా (0) గోల్డెన్ డకౌటైనా.. డేవిడ్ వార్నర్ (26 బంతుల్లో 42; 8 ఫోర్లు), రావ్మన్ పావెల్ (16 బంతుల్లో 33 నాటౌట్; ఒక ఫోర్, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం పంజాబ్‌తో లక్నో తలపడనుంది.
ఈ సీజన్లో దుమ్మురేపుతున్న చైనామన్ కుల్దీప్ యాదవ్.. కోల్‌కతాతో పోరులో మరోసారి విజృంభించాడు. మూడు ఓవర్లే వేసి 14 పరుగులిచ్చి నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఫించ్ (3)ను సకారియా రెండో ఓవర్లోనే ఔట్ చేయగా.. క్రీజులో కుదురుకునేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డ వెంకటేశ్ అయ్యర్ (6) అతడిని అనుసరించాడు. ఎనిమిదో ఓవర్లో కుల్దీప్ యాదవ్ వరుస బంతుల్లో బాబా ఇంద్రజిత్ (6), సునీల్ నరైన్ (0)ను ఔట్ చేయడంతో కోల్‌కతా 35/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ శ్రేయస్, నితీశ్ రాణా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇక కుదురకున్నట్లే అనుకుంటున్న సమయంలో కుల్దీప్ మరోసారి డబుల్ ధమాకాతో మెరిశాడు. 14వ ఓవర్ తొలి బంతికి శ్రేయస్‌ను బుట్టలో వేసుకున్న కుల్దీప్.. నాలుగో బంతికి డేంజర్ మ్యాన్ రస్సెల్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో కోల్‌కతా 83 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. ఆఖర్లో రాణా చక్కటి షాట్లతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు.