WFI | ఢిల్లీ: గతేడాది వివాదాలకు కేంద్ర బిందువు అయిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పారిస్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే మరోసారి డబ్ల్యూఎఫ్ఐ X అడ్హాక్ కమిటీ డ్రామాకు తెరలేచింది. డబ్ల్యూఎఫ్ఐని యథాతథ స్థితిలో ఉంచి దాని కార్యకలాపాలను అడ్హాక్ కమిటీకి అప్పగించాలని ఢిల్లీ కోర్టు శుక్రవారం భారత ఒలింపిక్ సంఘానికి (ఐవోఏ) ఆదేశాలు జారీ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలను అడ్హాక్ కమిటీకి అప్పగించాలని కోరుతూ ప్రముఖ రెజ్లర్లు బజరంగ్ పునియా, వినేశ్ ఫోగాట్, సాక్షి మాలిక్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారిస్తూ న్యాయస్థానం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పైన పేర్కొన్న రెజ్లర్లు గతేడాది డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి ఢిల్లీ వీధుల్లో న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. రెజ్లర్ల పోరాటంతో కేంద్ర ప్రభుత్వం డబ్ల్యూఎఫ్ఐని 2023 డిసెంబర్ 24న రద్దు చేయగా.. బ్రిజ్ భూషణ్ అనుచరుడైన సంజయ్ సింగ్ ఆధ్వర్యంలో కొత్త పాలకవర్గం ఎన్నికైంది. ఇక యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సైతం ఈ ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూఎఫ్ఐపై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఐవోఏ సైతం అడ్హాక్ కమిటీని రద్దు చేసింది.
రెజ్లర్లు నష్టపోయే ప్రమాదం: సంజయ్ సింగ్
ఢిల్లీ కోర్టు ఆదేశాలపై సంజయ్ సింగ్ స్పందిస్తూ ఇది యువ రెజ్లర్లకు తీరని నష్టం చేకూర్చుతుందని, వాటిని సవాల్ చేస్తామని అన్నాడు. అడ్హాక్ కమిటీ జోక్యంతో రాబోయే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెజ్లర్ల ప్రాతినిథ్యం ప్రశ్నార్థకంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఐవోఏ గతంలో అడ్హాక్ ప్యానెల్‌ను రద్దు చేసింది. ఈ ఆదేశాలపై మేం ద్విసభ్య ధర్మాసనానికి వెళ్తాం. అంతేగాక యూడబ్ల్యూడబ్ల్యూ, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసీ)నూ సంప్రదిస్తాం. బయటివాళ్ల జోక్యం అథ్లెట్లపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే వాళ్లు హెచ్చరించారు. త్వరలో రెండు వరల్డ్ చాంపియన్‌షిప్‌లు జరగాల్సి ఉంది. అడ్హాక్ కమిటీ జోక్యం చేసుకుంటే ఆ పోటీలలో రెజ్లర్ల ప్రాతినిథ్యం ప్రశ్నార్థకమవుతుంది’ అని అన్నాడు. ఆగస్టు 19 నుంచి 25 దాకా జోర్డాన్‌లో అండర్ 17 వరల్డ్ చాంపియన్‌షిప్, సెప్టెంబర్ 2-8 వరకు స్పెయిన్‌లో అండర్ 20 వరల్డ్ చాంపియన్‌షిప్ జరగాల్సి ఉంది.