బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:31:08

చెన్నైపై ఢిల్లీ ఘనవిజయం

చెన్నైపై ఢిల్లీ ఘనవిజయం

  • షాన్‌దార్‌ షా
  • హాఫ్‌సెంచరీతో మెరిసిన పృథ్వీ.. 

పరీక్ష పెడుతున్న పిచ్‌పై ఓపికగా ఆడిన పృథ్వీ షా ఢిల్లీకి మంచి స్కోరు అందిస్తే.. చెన్నై బ్యాట్స్‌మెన్‌ మాత్రం అసలు పోరాటం చేయకుండానే మ్యాచ్‌ను అప్పగించేశారు. ధోనీ ఫామ్‌ కంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌పైనే ఎక్కువ చర్చ సాగుతున్న నేపథ్యంలోనూ మహీ మరోసారి ఆలస్యంగా క్రీజులో అడుగుపెట్టి ఆశ్చర్యపరిచాడు. చెన్నై విజయానికి 26 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ భారీ షాట్లు ఆడలేక ఓటమిని ఆహ్వానించాడు. ధోనీసేనకు ఇది వరుసగా రెండో పరాజయం కాగా.. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ తొలి వారంలోనే మూడు మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ అందులో రెండు ఓటములు మూటగట్టుకుంది. క్లిష్టమైన పిచ్‌పై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో విజయంతో టాప్‌కు చేరింది. శుక్రవారం ఇక్కడి దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్‌ సేన 44 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా (43 బంతుల్లో 64; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకం బాదగా.. పంత్‌ (37 నాటౌట్‌), ధావన్‌ (35) రాణించారు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే పృథ్వీ క్యాచ్‌ ఔట్‌ అయినా.. దాన్ని ఎవరూ గమనించక పోవడంతో బతికిపోయాడు. అనంతరం లక్ష్యఛేదనంలో ధోనీ సేన 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. డుప్లెసిస్‌ (43) మరోసారి చక్కటి ఇన్నింగ్స్‌ ఆడినా.. మిగిలినవారు విఫలమవడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో రబాడ 3, నోర్జే 2 వికెట్లు పడగొట్టారు. పృథ్వీ షాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతా పంగా చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్లు ధరించి బరిలో దిగింది.

ఆరంభం అదిరినా..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మంచి ఆరంభం లభించినా.. ఆ జట్టు అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా ఆరంభం నుంచి ధాటిగా ఆడితే.. ధావన్‌ మాత్రం ఎనిమిదో ఓవర్‌ వరకు ఒక్క బౌండ్రీ కొట్టలేకపోయాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో పృథ్వీ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో సగం ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ 88/0తో నిలిచింది. చేతిలో 10 వికెట్లు ఉండటంతో అయ్యర్‌ సేన భారీ స్కోరు చేయడం ఖాయం అనుకుంటున్న దశలో.. చెన్నై బౌలర్లు చెలరేగారు. ఓపెనర్లను పెవిలియన్‌ పంపడంతో పాటు పరుగులకు కళ్లెం వేశారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (26), పంత్‌ క్రీజులో ఉన్నా భారీ షాట్లు ఆడలేకపోవడంతో ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకు పరిమితమైంది. 

ఆమడ దూరంలో..

లక్ష్యఛేదనలో చెన్నై ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. ఓపెనర్లు మురళీ విజయ్‌ (10), షేన్‌ వాట్సన్‌ (14) తక్కువ స్కోరుకే వెనుదిరగగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (5) రనౌటయ్యాడు.  ఒక ఎండ్‌ నుంచి నోర్జే నిప్పులు చెరుగుతుంటే.. మరో వైపు స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌ (1/18), అమిత్‌ మిశ్రా (0/23) తమ పని తాము చేసుకెళ్లారు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 47/3తో నిలిచింది. ఈ దశలో ధోనీ (15) క్రీజులోకి వస్తాడని అంతా అనుకుంటే.. జాదవ్‌ (26)ను బ్యాటింగ్‌కు పంపాడు. ఈ నిర్ణయంతోనే చెన్నై ఓటమి ఖాయమైంది. గత మ్యాచ్‌లో మాదిరిగానే డుప్లెసిస్‌ ఒంటరి పోరాటం చేసినా.. అతడికి సహకారం అందిచే వారు లేకపోవడంతో మ్యాచ్‌ చేజారింది. 16వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ అద్భుతాలు చేస్తాడనుకుంటే.. అదీ సాధ్యపడలేదు. జడేజా (12)తో కలిసి సింగిల్స్‌ తీసేందుకే పరిమితమైన మహీ.. ఓటమి అంతరాన్ని కూడా తగ్గించలేకపోయాడు.

స్కోరు బోర్డు

ఢిల్లీ: పృథ్వీ (స్టంప్డ్‌) ధోనీ (బి) చావ్లా 64, ధావన్‌ (ఎల్బీ) చావ్లా 35, పంత్‌ (నాటౌట్‌) 37, అయ్యర్‌ (సి) ధోనీ (బి) సామ్‌ కరన్‌ 26, స్టొయినిస్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 175/3. వికెట్ల పతనం: 1-94, 2-103, 3-161, బౌలింగ్‌: దీపక్‌ 4-0-38-0, సామ్‌ కరన్‌ 4-0-27-1, హజిల్‌వుడ్‌ 4-0-28-0, చావ్లా 4-0-33-2, జడేజా 4-0-44-0. 

చెన్నై: విజయ్‌ (సి) రబాడ (బి) నోర్జే 10, వాట్సన్‌ (సి) హెట్‌మైర్‌ (బి) అక్షర్‌ 14, డుప్లెసిస్‌ (సి) పంత్‌ (బి) రబాడ 43, గైక్వాడ్‌ (రనౌట్‌) 5, జాదవ్‌ (ఎల్బీ) నోర్జే 26, ధోనీ (సి) పంత్‌ (బి) రబాడ 15, జడేజా (సి) మిశ్రా (బి) రబాడ 12, సామ్‌ కరన్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 131/7. వికెట్ల పతనం: 1-23, 2-34, 3-44, 4-98, 5-113, 6-130, 7-131, బౌలింగ్‌: రబాడ 4-0-26-3, అక్షర్‌ 4-0-18-1, నోర్జే 4-0-21-2, అవేశ్‌ 4-0-42-0, మిశ్రా 4-0-23-0.logo