న్యూయార్క్: ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్స్ బెర్తులు ఖరారయ్యాయి. అమెరికా అమ్మాయి అమందా అనిసిమోవా, బెలారస్ భామ అరీనా సబలెంకా ఆదివారం టైటిల్ పోరులో తలపడనున్నారు. శుక్రవారం ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. సెమీస్‌లో 8వ సీడ్ అనిసిమోవా.. 6-7 (7/4), 7-6 (7/3), 6-3తో ఈ టోర్నీ మాజీ చాంపియన్, నవొమి ఒసాకా (జపాన్)ను ఓడించి వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరింది. ఆమె ఈ ఏడాది వింబూల్డన్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. 2 గంటల 56 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో 24 ఏండ్ల అమెరికా అమ్మాయి.. తొలి సెట్‌ను టైబ్రేకర్‌లో కోల్పోయినా తర్వాత పుంజుకుంది. రెండో సెట్లో లయను అందుకున్న ఆమె.. ఆ సెట్‌ను టైబ్రేక్‌లో గెలుచుకుని పోటీలోకి వచ్చింది. 4-1తో ఆ గేమ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఒసాకా దూకుడుగా పాయింట్లు సాధించడంతో ఆ గేమ్ సైతం టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేకర్‌లో అమందా విజృంభించి సెట్‌ను సొంతం చేసుకోవడంతో పోరు రసవత్తరమైంది. నిర్ణయాత్మక మూడో సెట్ ఒక దశలో ఒసాకా విజయానికి మూడు పాయింట్ల దూరంలో నిలిచినా అమందా వరుసగా మూడు బ్రేక్ పాయింట్లు సాధించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది.
ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సబలెంకా.. టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సెమీస్ పోరులో ఒకటో సీడ్ సబలెంకా.. 4-6, 6-3, 6-4తో అమెరికాకే చెందిన జెస్సికా పెగులాను చిత్తుచేసి ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. గతేడాది ఫైనలిస్టులు అయిన ఈ ఇద్దరి మధ్య రెండు గంటల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను చేజార్చుకున్న సబలెంకా.. ఆ తర్వాత తనలోని అసలు ఆటను బయటపెట్టి వరుస సెట్స్‌లో గెలిచి ఫైనల్ చేరింది. మ్యాచ్‌లో 8 ఏస్‌లు సంధించిన ఈ బెలారస్ క్రీడాకారిణి.. 43 విన్నర్లు కొట్టింది.
తన కెరీర్లో తొలిసారి ఒక గ్రాండ్‌స్లామ్ సెమీస్ చేరిన భారత ఆటగాడు యుకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీస్‌లో బాంబ్రీ, మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) ద్వయం.. 7-6 (7/2), 6-7 (5/7), 4-6తో బ్రిటన్ జోడీ స్కప్‌స్కీ-సలిస్బరీ చేతిలో ఓడింది. టోర్నీలో టాప్ సీడ్స్‌ను చిత్తుచేసిన ఇండో-న్యూజిలాండ్ జంట.. కీలక పోరులో నిరాశపరిచి టోర్నీ నుంచి వైదొలిగింది.