Deepak Hooda : ఐపీఎల్ వేలం సమీపిస్తున్న వేళ భారత క్రికెటర్ దీపక్ హుడా (Deepak Hooda)కు బిగ్ షాక్. వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలనుకున్న హుడాకు బీసీసీఐ (BCCI) పెద్ద ఝలక్ ఇచ్చింది. అతడి పేరును అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కలిగిన క్రికెటర్ల జాబితాలోంచి తొలగించలేదు. డిసెంబర్ 16న వేలం ఉన్నందున.. హుడా బౌలింగ్ అనుమానాస్పందంగా ఉందని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారమిచ్చింది. ఒకవేళ వేలంలో అతడిని ఎవరు కొన్నా బౌలింగ్ మాత్రం చేయించవద్దని స్పష్టం చేసింది.
పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ అయిన దీపక్ హుడా పద్దెనిమిదో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు ఆడాడు. అయితే.. అతడి బౌలింగ్ యాక్షన్‌పై బీసీసీఐ సందేహాలు వెలిబుచ్చిన నేపథ్యంలో ఏడు మ్యాచుల్లో ఆడినప్పటికీ బంతి అందుకోలేదు. కానీ, ఇటీవల దేశవాళీలో మాత్రం ఆరు ఓవర్లు వేశాడీ ఆల్‌రౌండర్. రంజీ ట్రోఫీలో ఒక ఓవర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో ఐదు ఓవర్లు వేశాడు హుడా. చివరిసారిగా డిసెంబర్ 8న జార్ఖండ్‌తో మ్యాచ్‌లో మూడు ఓవర్లు బౌలింగ్ చేశాడతడు.
Ahead of the #IPLAuction, the BCCI has intimated franchises that Deepak Hooda’s bowling action remains under the suspect category. pic.twitter.com/IivUDQWm4q
— Cricbuzz (@cricbuzz) December 13, 2025
హుడా యాక్షన్ అనుమానాస్పదంగా ఉన్నందున అతడు ఇకపై బౌలింగ్ చేయవద్దని బీసీసీఐ ఆదేశించనుంది. జమ్ముకశ్మీర్‌కు చెందిన అబిద్ ముష్తాక్(Abid Mushtaq) కూడా అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కలిగిన క్రికెటర్ల జాబితాలో ఉన్నాడు. ఇప్పటివరకూ హుడా 10 వన్డేలు, 21 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 19వ సీజన్ వేలంలో అతడు రూ.75 లక్షలకు పేరు నమోదు చేసుకున్నాడు.