దుబాయ్: తన జట్టు ఓడిపోయినా.. అతడు ప్రేమలో మాత్రం గెలిచాడు. స్టేడియాన్నే వేదికగా చేసుకుని తన ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేశాడు. ప్రేక్షకులు, తోటి ఆటగాళ్ల సమక్షంలోనే అతడు ఉంగరాలు మార్చుకున్నాడు. ప్రేమపక్షులు స్టేడియంలో ఏకమైన సన్నివేశం దుబాయ్‌లో జరిగిన చెన్నె- పంజాబ్ మ్యాచ్ వేదికగా మారింది. పంజాబ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జేబులో నుంచి ఉంగరం తీసి తన ప్రేయసికి తొడిగి ప్రేమ ప్రతిపాదన చేశాడు. ఊహించని పరిణామంతో కంగారుపడిన ఆ యువతి చాహర్ ప్రతిపాదనను అంగీకరించింది. ఆనందంతో ఉబ్బితబ్బిబై కౌగిలించుకుంది. అనంతరం ఆమె కూడా ఉంగరం తొడగడంతో క్రికెట్ స్టేడియంలో వారి నిశ్చితార్థం పూర్తయ్యింది. ఈ మ్యాచ్‌లో చాహర్ 4 ఓవర్లు వేసి 48 పరుగులు, ఒక వికెట్ తీశాడు. చాహర్ రింగ్ తొడిగిన అమ్మాయి ఎవరా? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. చాహర్‌ను వరించనున్న అమ్మాయి పేరు జయ భరద్వాజ్. ఢిల్లీకి చెందిన జయ బిగ్‌బాస్ ఫేమ్ సిద్ధార్థ్ భరద్వాజ్ సోదరి. మోడల్‌గా రాణిస్తున్న తన సోదరి మాలతి ద్వారా చాహర్‌కు జయ పరిచయమైంది.