చెన్నై: గత రెండు మూడు సీజన్ల మాదిరిగానే తాజా సీజన్ లోనూ భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్పై ఆసక్తికర చర్చ సాగుతున్నది. శనివారం ఢిల్లీతో ముగిసిన మ్యాచ్‌లో ధోనీ తల్లిదండ్రులు చెపాక్ స్టేడియానికి రావడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వీళ్లు నన్ను వీల్‌చైర్‌లో ఉన్నా ఆడిస్తారు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఈ చెన్నై మాజీ సారథి.. తాజాగా మరోసారి స్పందించాడు. ఓ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ స్పందిస్తూ ‘ఇప్పటికిప్పుడైతే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించను. ఇప్పుడు నాకు 43 ఏండ్లు. ఈ సీజన్ ముగిసేసరికి జులైలో నాకు 44 వస్తాయి. తర్వాతి సీజన్లో ఆడాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి నాకు మరో 10 నెలల సమయముంది. అయినా నా రిటైర్మెంట్ గురించి నిర్ణయించేది నేను కాదు. నా శరీరం. మనం ఆడాలా, వద్దా అని నిర్ణయించేదదే’ అని అన్నాడు. ఈ సీజన్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు వచ్చిన మహి.. 76 పరుగులు చేసినా అవి జట్టును గెలిపించేవైతే కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా అతడి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.