చిన్నప్పుడు బొమ్మ తుపాకీతో గురిచూసి లక్ష్యాన్ని కొట్టడం అలవాటు చేసుకున్న ఆ చిన్నారి.. పెద్దయ్యాక కూడా అదే తీరు కొనసాగిస్తున్నాడు. పుట్టుకతోనే వినికిడి సమస్యతో ఇబ్బంది పడ్డ ఆ బుడతడు.. తనలోని లోపానికి కుంగిపోకుండా షూటింగ్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. డెఫ్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన రెండు విభాగాల్లోనూ స్వర్ణాలు చేజిక్కించుకున్న ఆ హైదరాబాదీ షూటరే.. ధనుశ్ శ్రీకాంత్. ఇటీవల ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో స్వర్ణం నెగ్గిన ధనుశ్.. పారిస్ ఒలింపిక్స్ (2024)లో పతకం నెగ్గడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. డెఫ్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించినా.. తాను అందరితోపాటు సాధారణ క్రీడల్లోనూ సత్తాచాటగలనంటున్న శ్రీకాంత్‌పై ప్రత్యక కథనం..
పాఠశాల స్థాయిలో పాలొన్న ప్రతి ఆటలోనూ పతకాలు సాధించిన దనుశ్ శ్రీకాంత్‌ను తుపాకులు విపరీతంగా ఆకర్షించేవి. ఇంట్లో ఎప్పుడు చూసినా బొమ్మ తుపాకులతో ఆటలాడే వాడు. పుట్టుకతోనే వినికిడి సమస్య ఉండటంతో ప్రతి దశలో తల్లిదండ్రులు అండగా నిలువగా.. మొదట అతడు తైక్వాండో వైపు అడుగులు వేశాడు. ఎదో అల్లాటప్పాగా కాకుండా.. బాగా శ్రద్ధపెట్టి కోచింగ్ తీసుకున్న శ్రీకాంత్ చూస్తుండగానే జిల్లా స్థాయిలో పతకాలు సాధించడం మొదలుపెట్టాడు. తైక్వాండో బ్యాండ్-2కు చేరాగా.. వినికిడి సమస్యను అధిగమంచేందుకు తల్లిదండ్రులు అతడి చేవికి ప్రత్యేక పరికరాలు అమర్చారు. దీంతో తైక్వాండో నుంచి వైదొలిగిన శ్రీకాంత్ 2016 నుంచి షూటింగ్ వైపు అడుగులు వేశాడు. ఇతర విద్యార్థులతో కలిసి మామూలు పాఠశాలలోనే విద్యనభ్యసించిన శ్రీకాంత్.. ఇంటి సమీపంలో స్టార్ షూటర్ గగన్ నారంగ్ ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీ ఏర్పాటు చేయడంతో స్నేహితులతో కలిసి అందులోకి వెళ్లాడు. పసితనం నుంచి తాను ఎంతగానో ఇష్టపడే గన్స్, పిస్టల్స్, రైఫిల్స్ చూసిన శ్రీకాంత్.. షూటింగ్ నేర్చుకుంటానని పట్టుబట్టాడు. అప్పటికే పలు ఆటల్లో ప్రావీణ్యం ఉన్న తమ కుమారుడి ఉత్సాహాన్ని చూసి ఆ తల్లిదండ్రులు అతడిని ప్రోత్సహించారు.
గగన్ నారంగ్ ప్రోత్సాహంతో ప్రాక్టీస్ ప్రారంభించిన అనతి కాలంలోనే శ్రీకాంత్ మెరుగైన ఫలితాలు సాధించాడు. ఖేలో ఇండియా గేమ్స్‌లో తొలి సారి జాతీయ స్థాయి పతకం సాధించిన ధనుశ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అక్కడి నుంచి వరుసగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. 2019లో మొదటిసారి అంతర్జాతీయ స్థాయిలో బరిలోకి దిగిన ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు పతకాలతో సత్తాచాటాడు. కెరీర్ తొలి నాళ్లలో కోచ్‌లు, అంపైర్లు చెప్పే విషయాలను అర్థం చేసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన ధనుశ్.. ప్రస్తుతం స్పెషల్ కేటగిరీతో పాటు జనరల్లోనూ పతకాలు సాధించే సత్తా తనలో ఉందని నిరూపిస్తున్నాడు. ఇటీవల జర్మనీ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో శ్రీకాంత్ గోల్డెన్ షూట్‌తో కట్టిపడేశాడు. కెరీర్ ఆరంభం నుంచి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్నే ఎక్కువ ఇష్టపడే శ్రీకాంత్.. వచ్చే ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో సత్తాచాటాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ సాగిస్తున్నాడు. ప్రస్తతుం ఇంటర్ పూర్తి చేసిన 20 ఏండ్ల ధనుశ్ దీని కోసం రోజుకు 8 నుంచి 10 గంటల పాటు షూటింగ్ రేంజ్లో చెమటోడుస్తున్నాడు.
షూటింగ్ బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. తల్లిదండ్రులు తమ సంతోషాలను పక్కన పెట్టి అతడిని ఈ స్థాయికి తీసుకొచ్చారు. గన్ ఫర్ గ్లోరీ అకాడమీ సాయంతో ప్రాక్టీస్ కొనసాగుతున్నా.. టోర్నీల్లో పాల్గొనే సమయంలో అయ్యే ఖర్చులు భరించడం కూడా ఆ కుటుంబానికి తలకు మించిన భారంగా మారింది. వినికిడి సమస్య ఉండటంతో అతడితో పాటు తల్లి ఆశ కూడా ప్రతి టోర్నీకి వెళ్లేవారు. ఆమె అండతో నిలకడగా రాణించడం అలవరుచుకున్న శ్రీకాంత్.. తనకు ఇష్టం లేకపోయినా డెఫ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. ప్రత్యేక కేటగిరీలో కాకుండా.. జనరల్‌లోనే పోటీ పడాలని నిర్ణయించుకున్నా.. దేశానికి పతకం లభిస్తుందనే ఉద్దేశంతో 2021లో బ్రెజిల్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఫైనల్లో శ్రీకాంత్ 247.5 పాయింట్లు సాధించి డెఫ్ ఒలింపిక్స్‌లో నయా రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ ఈవెంట్లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. క్రీడారంగానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తే.. మరింత మెరుగ్గా రాణించి.. రాష్ర్టానికి, దేశానికి ఖ్యాతి తీసుకొస్తానని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తంచేస్తున్నాడు.
– నమస్తే తెలంగాణ క్రీడావిభాగం