DC Vs RR | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనున్నది. టాస్ సందర్భంగా సంజు శాంసన్ మాట్లాడుతూ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. వికెట్ బాగుందని.. రెండో భాగంలో మరింత మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. గతంలో జరిగిన మ్యాచ్ ఫలితాలు, వాటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని.. అయితే, మొదట బౌలింగ్ చేసి ప్రయోజనం పొందాలని భావిస్తున్నట్లు తెలిపాడు. తాను టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకునేవాడనని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురిసే అవకాశం ఉందని.. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తామని తెలిపాడు.
రెండు జట్లు గత మ్యాచుల్లో ఓడిపోయాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఉన్నాయి. డీసీ తన చివరి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో 12 పరుగులతో ఓటమిపాలైంది. ఇక జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. యశస్వి జైస్వాల్ మినహా.. మరే బ్యాట్స్‌మెన్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అదే సమయంలో బౌలర్లు సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఎనిమిది పాయింట్లు, ప్లస్ 0.899 రన్‌రేట్‌తో రెండోస్థానంలో ఉన్నది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడగా.. నాలుగు విజయాలు నమోదు చేసి.. ఒక మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఆరు మ్యాచులు ఆడి.. నాలుగు పాయింట్లు, మైనస్ 1.245 రన్‌రేట్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ.
డీసీ సబ్స్ : ముఖేష్ కుమార్, సమీర్ రిజ్వీ, దర్శన్ నల్కండే, డోనోవన్ ఫెరీరా, త్రిపురాన విజయ్.
రాజస్థాన్ రాయల్స్ జట్టు : యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్-కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీశ్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.
ఆర్ఆర్ సబ్స్ : శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, కునాల్ సింగ్ రాథోడ్.